అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద‌ర్భంగా గూగుల్ ప్ర‌త్యేక డూడుల్‌తో మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2023 4:28 AM GMT
Google Doodle, International Womens Day

గూగుల్ డూడుల్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. తల్లి, భార్య, సోదరి లేదా స్నేహితురాలు రూపంలో మన జీవితంలో మ‌హిళ‌లు ఎల్ల‌ప్పుడూ అండ‌గానే ఉంటారు. 1977లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మ‌హిళ‌లు సాధించిన సామాజిక‌, ఆర్థిక‌, సాంస్కృతి, రాజ‌కీయ విజ‌యాల‌ను గుర్తించేందుకు, వారిని మ‌రింత ప్రోత్స‌హించేందుకు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు.

ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్ర‌ముఖ దిగ్గ‌జ సెర్చ్ ఇంజ‌న్ గూగుల్ మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపింది.మ‌హిళ‌ల గొప్ప‌త‌నాన్ని ప్ర‌తిబింబిచేలా గూగుల్ డూడుల్‌ను రూపొందింది. మ‌హిళ‌లు త‌న జీవితంలో వారు పోషించే పాత్ర‌ను ఈ డూడుల్‌లో తెలియ‌జేశారు. ఈ యానిమేటెడ్ డూడుల్‌లో మహిళా రాజకీయ నాయకురాలు పీఠంపై మాట్లాడటం, నిరసన ప్రదర్శనలో మహిళలు, ఇద్దరు తల్లులు తమ బిడ్డలకు ఆహారం ఇవ్వడం వంటివి చూడొచ్చు.

ఈ డూడుల్ ముఖ్య ఉద్దేశ్యం మ‌హిళ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డమేన‌ని, నా జీవితంలో ఇత‌ర మ‌హిళ‌లు, నాకు మ‌ద్ద‌తు ఇచ్చిన అన్ని మార్గాల‌ను ప్ర‌తిబింబిస్తూ చాలా స‌మ‌యం గ‌డిపాన‌ని, ఈ డూడుల్‌ను రూపొందించిన అలిస్సా వినాన్స్ చెప్పారు.

Next Story