హురున్ రిచ్ లిస్ట్.. అంబానీని దాటేసిన అదానీ
11.6 లక్షల కోట్ల సంపదతో 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో గౌతమ్ అదానీ.. ముఖేష్ అంబానీని అధిగమించి మొదటి స్థానంలో నిలిచారు.
By Medi Samrat Published on 29 Aug 2024 3:47 PM IST11.6 లక్షల కోట్ల సంపదతో 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో గౌతమ్ అదానీ.. ముఖేష్ అంబానీని అధిగమించి మొదటి స్థానంలో నిలిచారు. హురున్ ఇండియా నివేదిక ప్రకారం.. గత ఏడాది భారతదేశంలో ప్రతి 5 రోజులకు ఒక కొత్త బిలియనీర్ వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. నివేదికలోని ఆస్తులు జూలై 31, 2024 నాటికి లెక్కించబడ్డాయి.
హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనాస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ “భారతదేశం ఆసియా సంపద సృష్టి ఇంజిన్‌గా ఎదుగుతోంది. చైనా బిలియనీర్ల సంఖ్యలో 25% క్షీణతను చూసింది. అయితే భారతదేశం 29% పెరుగుదలను చూసింది. బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయిలో 334కు చేరుకుందని తెలిపారు.
10,14,700 కోట్ల సంపదతో 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ముఖేష్ అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. 3,14,000 కోట్ల సంపదతో ఈ ఏడాది హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ శివ్ నాడార్, ఆయన కుటుంబం మూడవ స్థానంలో ఉన్నారు.
సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన వ్యాక్సిన్ తయారీదారు సైరస్ ఎస్ పూనావాలా మరియు ఆయన కుటుంబం ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. వారి తర్వాత సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ దిలీప్ షాంఘ్వీ ఉన్నారు. గత ఐదేళ్లలో భారత్ టాప్ 10లో ఆరుగురు నిలకడగా నిలిచారు. ఈ జాబితాలో గౌతమ్ అదానీ కుటుంబం అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత ముఖేష్ అంబానీ కుటుంబం, శివ నాడార్, సైరస్ ఎస్ పూనావల్లా, గోపీచంద్ హిందూజా అండ్ ఫ్యామిలీ, రాధాకిషన్ దమానీ అండ్ ఫ్యామిలీ ఉన్నారు.
2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో కనిపించిన అతి పిన్న వయస్కుడు 21 ఏళ్ల కైవల్య వోహ్రా. అతడు స్టార్టప్ Zeptoని నడుపుతున్నాడు. Zepto సహ వ్యవస్థాపకుడు 22 ఏళ్ల అదిత్ పాలిచా ఈ జాబితాలో రెండవ అతి పిన్న వయస్కుడు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో భారతీయ సినీ నటుడు షారుఖ్ ఖాన్ తొలిసారిగా చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో అతని వాటా విలువ పెరగడమే దీనికి ప్రధాన కారణం.