ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానానికి గౌతమ్ అదానీ.. నెక్స్ట్ టార్గెట్ మస్కేనా.!
Gautam Adani Becomes 4th Richest Person In The World. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు
By అంజి Published on 21 July 2022 8:38 AM GMTఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. సంపద సృష్టిలో గౌతమ్ అదానీ రికార్డులు సృష్టిస్తున్నారు. రిపోర్టు ప్రకారం.. అదానీ నికర సంపద గురువారం నాటికి 115.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బిల్‌గేట్స్ సంపద 104.6 బిలియన్ డాలర్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ.. 90 బిలియన్ల డాలర్ల నికర సంపదతో ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో 10 వ స్థానంలో ఉన్నారు.
చిరు వ్యాపారంతో తన ప్రస్థానం మొదలుపెట్టిన గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ విజయవంతమైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ చిన్న కమోడిటీస్ ట్రేడింగ్ వ్యాపారాన్ని మొదలుకొని ఓడరేవులు, గనులు, గ్రీన్ ఎనర్జీతో కూడిన ఎన్నో రంగాల్లో రానిస్తున్నారు. ఫిబ్రవరిలో తన వ్యక్తిగత సంపదను పెంచుకోవడంతో అతను తన తోటి దేశస్థుడు ముఖేష్ అంబానీని అధిగమించి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచాడు.
గత వారం, గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్, గాడోట్ భాగస్వామ్యంతో ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్ ప్రైవేటీకరణ కోసం టెండర్‌ను గెలుచుకున్నట్లు తెలిపింది. ఇటీవల, అదానీ గ్రూప్ 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడానికి రేసులో ఉందని, ఇది విమానాశ్రయాల నుండి పవర్, డేటా సెంటర్‌ల వరకు తన వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి ప్రైవేట్ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి ఉపయోగించబడనుంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ డేటా నెట్‌వర్క్స్ కూడా వేలంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకున్నాయి.
బిల్ గేట్స్ గత వారం తన సంపద నుండి 20 బిలియన్ డాలర్లను తన లాభాపేక్షలేని సంస్థకు విరాళంగా అందించిన తర్వాత ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచారు.
స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 235.8 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన తర్వాత భారీ వివాదంలో చిక్కుకున్నాడు.
రెండవ స్థానంలో 155.6 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ కుటుంబం ఉంది. అమెజాన్ యొక్క సీఈవో జెఫ్ బెజోస్ 148.4 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు.
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ర్యాంకింగ్స్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల రోజువారీ హెచ్చు తగ్గులను ట్రాక్ చేస్తుంది. సంపద-ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్ నికర విలువ, బిలియనీర్ అని ఫోర్బ్స్ ధృవీకరించిన ప్రతి వ్యక్తి యొక్క ర్యాంకింగ్‌పై కొనసాగుతున్న అప్‌డేట్‌లను అందిస్తోంది.