బ్యాంక్‌ చెక్‌లు ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి

ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరగడంతో గతంలో మాదిరిగా ఇప్పుడు బ్యాంక్‌ చెక్‌ల వాడకం బాగా తగ్గిపోయింది. అయితే, వ్యాపార సంస్థల్లో మాత్రం నేటికీ చెక్.

By అంజి  Published on  18 Dec 2023 7:41 AM GMT
precautions, bank cheques, bank check Issue

బ్యాంక్‌ చెక్‌లు ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి

ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరగడంతో గతంలో మాదిరిగా ఇప్పుడు బ్యాంక్‌ చెక్‌ల వాడకం బాగా తగ్గిపోయింది. అయితే, వ్యాపార సంస్థల్లో మాత్రం నేటికీ చెక్. పేమెంట్స్‌ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. అయితే.. వ్యక్తిగతంగా లేదా వృత్తిగతంగానైనా చెల్లింపుల కోసం ఎవరికైనా చెక్‌ ఇచ్చే ముందు కాస్త జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే.. దాని వల్ల న్యాయ వివాదాలే గాక ఆర్థిక నష్టాలు కూడా తప్పవు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మోసాలు.. చట్టపరమైన సమస్యలు దరిచేరవు

చెక్కులోని వివరాలు

మీరిచ్చే చెక్‌లో వారి పేరు, వ్యాపార సంస్థ వివరాలు స్పష్టంగా రాయాలి. ఇక్కడ తేడా వస్తే.. చెక్కు క్లియరెన్స్‌ రిజెక్ట్‌ అవ్వొచ్చు. చెక్కులో పేరును రెండు, మూడు పదాలుగా రాసేటప్పుడు, పదాల మధ్యలో ఎక్కువ గ్యాప్‌ ఉండొద్దు. అలా ఉంటే ఖాళీలో వేరే పేరు లేదా అక్షరాలను చేర్చి దాన్ని వేరేవారు క్రెడిట్‌ చేసుకుంటారు. అలాగే.. మీరు రాసిన మొత్తాన్ని కూడా ఎవరూ మార్చకుండా చూడాలి.

నగదు నిల్వ, తేదీ

మీ బ్యాంక్‌ అకౌంట్‌లో తగినంత క్యాష్‌ లేకుండా ఎవరికీ చెక్‌ ఇవ్వొద్దు. ఒకవేళ.. ఇలాంటి కేసుల్లో చెక్‌ బౌన్స్‌ అయితే.. అది మీ క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది. కాబట్టి మీ వద్ద తగినంత డబ్బు ఉంటేనే చెక్‌ ఇవ్వండి. అలాగే.. చెక్‌ మీద తేదీ తప్పు లేకుండా రాయాలి. కచ్చితమైన ఆర్థిక రికార్డులకు చెక్‌ నెంబర్‌తో సహా తేదీలు చాలా కీలకం.

పోస్ట్‌ డేటెడ్‌ చెక్కు

సాధారణంగా చాలా మంది పోస్ట్‌ - డేటెడ్‌ చెక్కులు ఇస్తుంటారు. ముఖ్యంగా తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ పోస్ట్‌- డేటెడ్‌ చెక్కులను వేర్వేరు వ్యక్తులకు ఇవ్వొద్దు. దీనివల్ల తికమకకు గురై బ్యాంకులో డబ్బు నిల్వ ఉంచడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. పోస్ట్‌ -డేటెడ్‌ చెక్‌ ఇచ్చినప్పుడు ఆ డేట్‌ను నోట్‌ చేసుకోవడమే కాకుండా.. దాని కోసం ముందుగానే ప్లాన్‌ చేసుకోవడం చాలా అవసరం.

సంతకం, ఓవర్‌రైట్‌

చెక్కుకు కుడివైపు కింద చేసిన సంతకం, మీరు బ్యాంకులో ఇచ్చిన సంతకంతో సరిపోలాలి. లేదంటే చెక్కును తిరస్కరిస్తారు. అలాగే చెక్కులోని వివరాలను ఓవర్‌రైట్‌ చేయకూడదు. చెక్‌ను తీసుకోవడానికి, రిజెక్ట్‌ చేయడానికి బ్యాంకుకు స్వేచ్ఛ ఉంది. కావున చెక్కుపై కొట్టివేతలు ఉండకుండా జాగ్రత్తగా రాయాలి.

క్రాస్‌ ది చెక్‌, BEARER

మీరు ఎవరి పేరు మీద చెక్కు ద్వారా డబ్బు చెల్లించినా.. చెక్కు ఎడమవైపు పైన డబుల్ క్రాస్‌ లైన్‌ను గీయాలి. ఆ రెండు లైన్ల మధ్యలో 'A/C Pay only' అని రాయాలి. దీంతో ఆ డబ్బు కచ్చితంగా అతడి బ్యాంకు ఖాతాలోకే వెళ్తుంది. అలాగే చెక్కు పైనుంచి 2వ లైన్లో చివర BEARER అని ఉన్న అక్షరాలపై అడ్డంగా గీత గీయాలి.

బ్లాంక్‌ చెక్‌

ఖాళీగా ఉన్న చెక్కు మీద సంతకం మాత్రమే చేసి ఎవరికీ ఇవ్వొద్దు. అవతలి వ్యక్తులు దీన్ని దుర్వినియోగం చేస్తారు. దీంతో చెక్కు జారీ చేసిన వారు అనేక ఆర్థిక నష్టాలకు, చట్టపరమైన ఇబ్బందులకు గురౌతారు. ఎల్లప్పుడూ చెక్కు వివరాలను పూర్తిగా రాసి సరైన వ్యక్తులకు మాత్రమే అందజేయండి.

నోట్‌ రాయాల్సిందే..

ఎవరికైనా చెక్కు ఇచ్చినప్పుడు దాని నంబరు, ఖాతా పేరు, అమౌంట్‌ మొత్తం, జారీ చేసిన తేదీ లాంటివన్నీ ముఖ్యమైన చోట నోట్‌ చేసుకోండి. ఏ కారణం వల్లనైనా చెక్కును రద్దు చేయాలనుకున్నప్పుడు ఈ సమాచారం అవసరం పడుతుంది. బ్యాంకుకు కాల్‌ చేసి తెలుపాలన్నా స్వయంగా వెళ్లి అడిగినా బ్యాంకు తప్పక ఆ చెక్కు వివరాలు అడుగుతుంది.

అదనపు జాగ్రత్తలు

చెక్కును ఇస్తున్నప్పుడు.. పేరు, అమౌంట్‌ మొత్తంపై ట్రాన్స్‌పరెంట్‌ సెల్లో టేప్‌ను అతికిస్తే.. చెక్కును ఎవరూ మార్చలేదరు. చెమట, నీరు లాంటివి తగిలినప్పుడు చెక్కుపై అక్షరాలు కూడా చెరిగిపోవు. చెక్కును జారీ చేసేటప్పుడు వెనుక భాగంలో మీ పేరు, ఖాతా వివరాలు, మొబైల్‌ నంబర్‌తో పాటు సంతకం చేయండి.

Next Story