ఫేస్‌బుక్‌ మరో కీల‌క నిర్ణయం.. ఇకపై ఆ ఫీచర్ అందుబాటులో ఉండ‌దు

Facebook Plans to Shut Down Its Facial Recognition System.ఇటీవ‌ల కాలంలో ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Nov 2021 4:12 AM GMT
ఫేస్‌బుక్‌ మరో కీల‌క నిర్ణయం..  ఇకపై ఆ ఫీచర్ అందుబాటులో ఉండ‌దు

ఇటీవ‌ల కాలంలో ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ పై పెద్ద ఎత్తున విమ‌ర్శలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా వ్య‌క్తిగ‌త గోప్య‌త విష‌యంలో పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌డంతో ఫేస్‌బుక్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఫేస్‌బుక్‌లో ఫేషియల్‌ రికగ్నైషన్‌ను తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ కంపెనీ మాతృసంస్థ 'మెటా' ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ఫేస్ ప్రింట‌ర్ల‌ను సైతం తొల‌గించనున్న‌ట్లు వెల్ల‌డించింది. ఫేషియల్‌ రికగ్నైషన్‌ టెక్నాలజీలో ఇదోక భారీ మార్పు కానుంద‌ని 'మెటా' ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జెరోమ్‌ పెసెంటి అన్నారు. ప్ర‌స్తుతం దీన్ని ఉప‌యోగిస్తున్నవారు భ‌విష్య‌త్తులో ఉప‌యోగించలేర‌న్నారు. పెరుగుతున్న ఆందోళ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా బ్యాలెన్స్ చేసేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఫేస్‌బుక్‌ 2010లో ఫేస్‌ రికగ్నైషన్‌ సాంకేతికతను తీసుకొచ్చింది. దీన్ని తొల‌గించ‌డం వ‌ల్ల ఇక‌పై యూజర్ల ఖాతాల్లోని వ్యక్తిగత ముఖ గుర్తింపు టెంప్లేట్‌లు తొలిగిపోనున్నాయి. ఫోటోలు, వీడియోల్లోని ముఖాలను ఇక‌పై ఫేస్‌బుక్‌ దానంతట అది గుర్తించదు. ఫొటోల్లోని వ్యక్తిని సూచించడానికి.. వారి పేరుతో ట్యాగ్‌ చేయడానికి సాధ్య‌ప‌డ‌దు. ఫేస్‌బుక్ వాడుతున్న వారిలో దాదాపు మూడొంతుల మంది ఈ పేషియ‌ల్ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని తొల‌గించ‌నుండ‌డంతో.. ఒక బిలియ‌న్ కంటే ఎక్కువ మంది ప్ర‌భావితం కానున్నారు. ముఖ్యంగా కంటిచూపు స‌రిగ్గా లేని వారికి ఉప‌యోగ‌ప‌డే ఆటోమెటిక్‌ ఆల్ట్‌ టెక్ట్స్‌ (ఏఏటీ)పై దీని ప్రభావం పడనుంది.

దీన్ని తొల‌గించ‌డం వ‌ల్ల లాభాలు కూడా ఉన్నాయి. అప‌రిచిత వ్య‌క్తులు.. ఫోటోల్లోని వ్య‌క్తుల‌ను గుర్తించ‌లేరు. దీంతో వారి వివ‌రాలు ఇత‌రులు తెలియ‌కుండా ఉంటాయి. ఫేస్‌బుక్‌లో ఫేస్‌ రికగ్నైషన్ టెక్నాల‌జీ కార‌ణంగా వ్య‌క్తిగ‌త ప్రైవైసీకి సంబంధించి ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. దీనికి సంబంధించి నియంత్రణ సంస్థలు దీని వినియోగాన్ని నియంత్రించే నిబంధనలు రూపొందించే ప్రక్రియలో ఉన్నట్లు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తెలిపింది. అయితే ఈ మార్పులు ఈ నెలలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story