పేరు మార్చుకోనున్న పేస్‌బుక్..?
Facebook plans rebrand with new name.ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన పేరును మార్చుకోనుందని ఓ ప్రముఖ
By తోట వంశీ కుమార్ Published on 20 Oct 2021 7:03 AM GMTప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన పేరును మార్చుకోనుందని ఓ ప్రముఖ టెక్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ది వెర్జ్ అనే పత్రిక ప్రచురించిన కథనం మేరకు.. పేస్‌బుక్ సంస్థ తన పేరు మార్చుకోనుందట. ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్ బర్గ్.. పేరు మార్పుపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. అక్టోబరు 28న జరిగే కంపెనీ వార్షికోత్సవ సదస్సులో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారట. ఇటీవల అమెరికా ప్రభుత్వం నుంచి పేస్‌బుక్ వ్యాపార కార్యాకలాపాలకు న్యాయపరమైన ఇబ్బందులు కలుగుతుండడంతో పేరు మార్పు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వివాదాలు ఎదురైనప్పుడు పేస్‌బుక్ పేరు వార్తల్లో నిలవడంతో.. యూజర్ల సంఖ్య పడిపోతుండడం కూడా పేరు మార్పుకు ఓ కారణంగా చెప్పుకొచ్చింది.
కంపెనీ పేరు మార్చి దాని కిందకే పేస్‌బుక్ యాప్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఒక్యూలస్ తీసుకురానుందట. పేరు మార్పు వల్ల వినియోగదారులు(యూజర్ల)పై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పేస్‌బుక్ పేరు మారితే.. దానికి ఏ పేరు పెడతారు అనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటి వరకు సీఈఓ జుకర్ బర్గ్ కానీ.. పేస్‌బుక్ అధికారులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.
ఇదిలా ఉంటే.. వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో దిగ్గజ కంపెనీలు తమ అవసరాన్ని బట్టి మాతృ కంపెనీ పేరు మార్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఉదాహారణకు 2015లో గూగుల్.. అల్పాబెట్ కంపెనీని ఏర్పాటు చేసి దాన్నే పేరెంట్ సంస్థగా చేసింది.