వారంలో రెండోసారి.. నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్
Facebook and Instagram faces the second outage this week.సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లు మరోసారి
By తోట వంశీ కుమార్ Published on 9 Oct 2021 4:40 AM GMTసామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లు మరోసారి నిలిచిపోయాయి. భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి సమయంలో దాదాపు రెండుగంటల పాటు ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లు పనిచేయలేదు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రిఫ్రెష్ కాకపోవడం, ఫీడ్స్ ఆగిపోవడంతో కాసేపు ఏం జరుగుతుందో తెలియక వినియోగదారులు ఆగమాగం అయ్యారు. అసహనానికి గురైన నెటిజన్లు.. Instagram Down, #Instadown హ్యాష్‌ట్యాగులు ట్రెండింగ్ చేశారు. దాదాపు రెండు గంటల అనంతరం సర్వీసులు పునరుద్దరించబడ్డాయి. కాగా.. దీనిపై వినియోగదారులకు పేస్‌బుక్ క్షమాపణలు చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఓపికగా ఎదురుచూసినందుకు యూజర్లకు కృతజ్ఞతలు తెలిపింది.
ఫేస్‌బుక్ సంబంధిత సేవలకు అంతరాయం ఏర్పడడం ఈ వారంలో ఇది రెండోసారి. సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ స్తంబించిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం కలిగిన అంతరాయం కారణంగా మార్క్ జుకర్ బర్గ్‌కు భారీ నష్టం వాటిల్లింది. 7 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.50వేల కోట్లు పైగా నష్టం వాటిల్లింది. కాగా. శుక్రవారం మరోసారి పేస్‌బుక్ సేవలకు అంతరాయం కలిగింది. సోమవారం, శుక్రవారం ఏర్పడిన అంతరాయాలకు ఒకే కారణం కాదని చెప్పినప్పటికి అది ఏమిటన్నది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఫేస్‌బుక్ అంతరాయాలపై సోషల్‌మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.