ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకే!

కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా లావాదేవీలు లేక నిలిచిపోయిన...

By -  అంజి
Published on : 24 Feb 2026 6:36 AM IST

EPFO Inoperative Accounts, Auto-Credit EPF Refund, Mansukh Mandaviya, Labour Welfare Scheme, Unorganised Workers Scholarship, Aadhaar-seeded Bank Account, EPF Withdrawal Rules

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకే!

కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా లావాదేవీలు లేక నిలిచిపోయిన (Inoperative) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాల్లోని డబ్బును నేరుగా సబ్‌స్క్రైబర్ల ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించింది.

పైలట్ ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు:

ఎవరికి ప్రయోజనం: ₹1,000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉండి, గత 36 నెలలుగా ఎటువంటి కంట్రిబ్యూషన్ లేని 7.11 లక్షల ఖాతాలను తొలి విడతలో ఎంపిక చేశారు.

మొత్తం నిధులు: ఈ 7.11 లక్షల ఖాతాల్లో ఉన్న సుమారు ₹30.52 కోట్ల రూపాయలను ఆటో క్రెడిట్ చేయనున్నారు.

పత్రాల అవసరం లేదు: ఈ రీఫండ్ కోసం ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన పనిలేదు. అయితే, సదరు లబ్ధిదారు లేదా నామినీ బ్యాంక్ ఖాతా ఆధార్‌తో సీడ్ (Aadhaar-seeded) అయి ఉండాలి. ఖాతా యాక్టివ్‌గా ఉండాలి.

తదుపరి అడుగు: ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, మిగిలిన 24.76 లక్షల ఖాతాల్లోని (ఎక్కువ మొత్తంలో నిధులు ఉన్నవి) నగదును కూడా ఇదే విధంగా జమ చేస్తారు.

పెరుగుతున్న నిధులు:

గణాంకాల ప్రకారం, గత రెండు దశాబ్దాలుగా సుమారు 31.86 లక్షల ఖాతాల్లో కలిపి ₹10,903 కోట్లు మూలుగుతున్నాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో ₹1,638.37 కోట్లుగా ఉన్న ఈ ఇన్-ఆపరేటివ్ నిధులు, 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఐదు రెట్లు పెరిగి ₹8,505.23 కోట్లకు చేరుకున్నాయి.

అసంఘటిత రంగ కార్మికుల పిల్లలకు అండ:

కార్మిక శాఖ మరో ముఖ్యమైన సంస్కరణను ప్రవేశపెట్టింది. బీడీ, సినీ, ఐరన్, మాంగనీస్ వంటి గనుల్లో పనిచేసే అసంఘటిత రంగ కార్మికుల పిల్లల విద్య కోసం ఈ మార్పులు చేశారు.

డబుల్ స్కాలర్‌షిప్ అవకాశం: గతంలో కార్మిక శాఖ ఇచ్చే సంక్షేమ స్కాలర్‌షిప్ తీసుకుంటే, ఇతర ప్రభుత్వ మెరిట్ స్కాలర్‌షిప్‌లు పొందే వీలుండేది కాదు. ఇప్పుడు కార్మిక శాఖ స్కాలర్‌షిప్‌తో పాటు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఇతర మెరిట్ స్కాలర్‌షిప్‌లను కూడా విద్యార్థులు పొందవచ్చు. దీనివల్ల డ్రాపౌట్స్ తగ్గి, ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది.

Next Story