ట్విట్ట‌ర్ లోగో మార్పు.. పిట్ట‌ స్థానంలో కుక్క‌

ఎలాన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ లోగోను మార్చేశాడు. పిట్ట స్థానంలో కుక్క‌ను పెట్టాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2023 10:18 AM IST
Twitter logo, shiba inu

ట్విట్ట‌ర్ లోగో మార్పు

ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ చేతుల్లోకి వెళ్లిన త‌రువాత నుంచి ట్విట్ట‌ర్‌లో ప‌లుమార్పులు చోటు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మంది ఉద్యోగుల‌ను తొల‌గించిన మ‌స్క్‌.. బ్లూ టిక్ కోసం న‌గ‌దు చెల్లించాల‌నే నిబంధ‌న‌ను విధించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ట్విట్ట‌ర్ లోగోను మార్చేశారు.

క్రిప్టోకరెన్సీలో ఒకటైన డోజ్‌కాయిన్‌ లోగోగా వినియోగించే శునకం ఫొటో అది. సాధారణంగా నెటిజన్లు మీమ్స్ సృష్టించడానికి ఈ డోజ్‌కాయిన్ డాగ్ ఫొటోను ఎక్కువ‌గా వాడుతుంటారు. ఇప్పుడదే ట్విట్టర్ లోగోగా మారింది.

డోజ్‌కాయిన్ లోగోగా 'షిబా ఇను' అనే కుక్క ఫోటోను వినియోగిస్తుంది. షిబా ఇను అనేది జ‌పాన్‌కు చెందిన హంటింగ్ బ్రీడ్‌. అది న‌చ్చ‌డం వ‌ల్లే తాను కూడా ట్విట్ట‌ర్ బ్లూ బ‌ర్డ్ లోగోకు బ‌దులుగా డోజ్ కాయిన్ షిబా ఇను డాగ్ ఫోటోను వాడిన‌ట్లు మ‌స్క్ తెలిపాడు.

యూజర్లు తమ ట్విట్టర్ అకౌంట్‌ను ఓపెన్ చేసి, రీఫ్రెష్ చేయగానే కొత్త లోగో దర్శనం క‌నిపిస్తోంది. ప్రస్తుతానికి వెబ్‌వర్షన్‌కు మాత్రమే ట్విట్టర్ లోగో ఛేంజ్ అయింది. దశలవారీగా అన్ని వర్షన్ల‌లోనూ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

Next Story