ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్
Elon Musk acquires Twitter for $44 billion.విద్యుత్ కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్ అధినేత
By తోట వంశీ కుమార్ Published on 26 April 2022 8:15 AM ISTఅంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అనుకున్నది సాధించారు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా పేరుగాంచిన ఆయన రెండు వారాల క్రితమే ట్విట్టర్‌లో 9.2 శాతం వాటా కొనుగోలు చేయగా.. ఇప్పుడు ఆ సంస్థ మొత్తాన్ని తన సొంతం చేసుకున్నాడు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌ను సొంతం చేసుకునేందుకు బోర్డుతో ఆయన చర్చలు జరుపుతుండంగా.. ఎట్టకేలకు 44 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదిరింది.
కాగా.. ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 46.5 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమని గతవారమే ఎలన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని మస్క్ నగదు రూపంలో చెల్లించనున్నారు. మస్క్ ప్రపోజల్‌పై సుదీర్ఘంగా చర్చించి విక్రయించాలని నిర్ణయించినట్టు ట్విట్టర్ బోర్డు ప్రకటించింది. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయడంతో ఇక నుంచి ఓ ప్రైవేట్ సంస్థ యజమాని ఆధీనంలో పనిచేయనుంది.
కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. 'ప్రజాస్వామ్య పరిరక్షణకు వాక్ స్వాత్రంత్యం గట్టిపునాది. భవిష్యత్తులో మానవాళికి కావాల్సిన కీలక అంశాలపై చర్చించేందుకు ట్విట్టర్ ఓ డిజిటల్ వేదిక. కొత్త ఫీచర్ల ద్వారా ట్విట్టర్ మునుపెన్నడూ లేనంత ఉన్నంతగా తీర్చిదద్దుతాం. అల్గారిథమ్‌ను ఒపెన్‌సోర్స్‌లో ఉంచి నమ్మకాన్ని పెంచుతాం. ట్విట్టర్‌కు ఉన్న పూర్తిస్థాయి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు కంపెనీ, యూజర్లతో కలిసి పనిచేందుకు వేచి చూస్తున్నా..' అంటూ రాసుకొచ్చారు. కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో సోమవారం ట్విట్టర్ షేర్ 3 శాతం పెరిగింది.
🚀💫♥️ Yesss!!! ♥️💫🚀 pic.twitter.com/0T9HzUHuh6
— Elon Musk (@elonmusk) April 25, 2022