కేంద్రం కీలక నిర్ణయం.. దిగిరానున్న వంటనూనెల ధరలు
Edible oil prices to go down as India allows duty-free import of 20 lakh MT oil.ఇటీవల కాలంలో వంట నూనె ధరలు
By తోట వంశీ కుమార్ Published on 25 May 2022 4:46 AM GMTఇటీవల కాలంలో వంట నూనె ధరలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న వంట నూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా వంట నూనెల ధరలు త్వరలోనే తగ్గుముఖం పట్టనున్నాయి.
వంట నూనెల దిగుమతిపై విధిస్తున్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తొలగించింది. ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్) నూనె, మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై ఇప్పటి వరకు విధిస్తున్న కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ను తొలగిస్తున్నట్లు కేంద్రం మంగళవారం ప్రకటించింది.
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఉత్వర్తులో పేర్కొంది. అయితే.. దిగుమతుల కోటా కోసం మే 27 నుంచి జూన్ 18 లోపు ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోటా మించి దిగుమతి చేసుకునే నూనెలకు సుంకాలు మామూలుగా వర్తించనున్నాయి. ఈ లెక్కన మార్చి 31,2024 వరకు మొత్తం 80లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్‌పై సుంకాలను లేకుండానే దిగుమతి చేసుకోవచ్చు.
కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వంటనూనె ధరలు భారీగా దిగివచ్చే అవకాశం ఉంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా వంటనూనెల ధరలు పెరిగాయి. భారత్‌కు తనకు కావాల్సిన వంటనూనెల అవసరాలలో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది.