లీవ్‌లో ఉన్న ఉద్యోగికి ఫోన్ చేస్తే.. లక్ష జరిమానా కట్టాల్సిందే..? కొత్త రూల్..!
Dream11 introduces 'UNPLUG' policy.ఉద్యోగాన్ని ఎంతో ఇష్టంగా చేస్తున్నప్పటికీ సెలవు రోజుల్లో
By తోట వంశీ కుమార్ Published on 30 Dec 2022 8:39 AM GMTఉద్యోగాన్ని ఎంతో ఇష్టంగా చేస్తున్నప్పటికీ సెలవు రోజుల్లో మాత్రం కుటుంబంతో సరదాగా గడిపేందుకే ఇష్టపడుతుంటాం. కుటుంబంతో ఆనందంగా ఉన్న సమయంలో ఆఫీసు నుంచి సహచర ఉద్యోగులు లేక బాస్ నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తుంటుంటే చాలా చిరాకుగా ఉంటుంది గదా..? అయితే.. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా సెలవులను ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మేరకు కంపెనీలు కొత్త కొత్త పాలసీలు తీసుకువస్తున్నాయి. సెలవుల్లో ఉన్న ఉద్యోగిని సహచర ఉద్యోగాలు గానీ ఎవరైనా సరే ఆఫీస్ పని అంటూ ఇబ్బంది పెడితే వారి స్థాయితో సంబంధం లేకుండా లక్ష రూపాయల జరిమానా కట్టాల్సిందేనని ఓ కంపెనీ అంటోంది.
ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ డ్రీమ్11 ఈ కొత్త పాలసీని తమ ఉద్యోగుల కోసం తీసుకువచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఏ ఉద్యోగి అయినా లీవ్‌లో ఉన్నప్పుడు తోటి ఉద్యోగులు లేదా బాస్ గాని ఎవరైనా సరే సదరు ఉద్యోగికి ఆఫీస్ వర్క్ అంటూ ఎటువంటి కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిల్స్ వంటివి చేయకూడదు. అలా చేసి ఇబ్బంది పెడితే మాత్రం అక్షరాలా లక్ష రూపాయలు జరిమానా విధిస్తున్నాం అని తమ కొత్త పాలసీ గురించి లింక్టిన్‌లో పోస్ట్ చేసింది.
ఈ విధానంపై కంపెనీ వ్యవస్థాపకులు హర్ష్ జైన్, భవిత్ సేథ్ లు మాట్లాడుతూ.. సెలవులో ఉన్న ఉద్యోగికి వారం రోజుల పాటు ఆఫీసుతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. మెయిల్స్ కానివ్వండి, మెసేజ్‌లు కానివ్వండి, వాట్సాప్ గ్రూప్‌లోనైనా మెసేజ్‌లు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్ అనే మాట ఎత్తకూడదు. ఈ విధానం వల్ల ఉద్యోగులు తమ కుటుంబాలతో సంతోషంగా ఉంటారు. తగినంత విశ్రాంతి వారికి లబిస్తుంది. దీంతో వారి మానస్థితి, జీవన ప్రమాణాలు నాణ్యత, వర్క్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందని మేము అర్థం చేసుకున్నాం. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు.