కరోనా కష్టాల నుంచి సామన్యుడు ఇంకా కోలుకోలేనే లేదు. ఓ వైపు పెట్రో ధరలు పెరుగుతుండడంతో పాటు మరోవైపు సిలిండర్ ధరలు కూడా ఎగబాకుతున్నాయి. దీంతో చాలీచాలని జీతాలతో బ్రతుకు వెళ్లదీయలేక.. సగటు మధ్యతరగతి జీవి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. పెరుగుతున్న వంట గ్యాస్ ధరలతో మళ్లీ కట్టెల పొయ్యికి మారిన ఆశ్చర్యం లేదంటున్నారు.
తాజాగా మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. రాయితీ గ్యాస్ సిలిండర్ పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.75 పెంచాయి. ఇక పెరిగిన ధరలు నేటి(బుధవారం) నుంచే అమల్లోకి రానున్నాయి. కాగా.. 15 రోజుల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెరగడం గమనార్హం. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కేజీల రాయితీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.884.50కు చేరగా.. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్ ధర రూ.1693కి చేరింది. రాయితీ వంటగ్యాస్ ధరలు కోల్‌కతాలో రూ.886.50, ముంబైలో రూ.859.50, చెన్నైలో రూ.875.50 ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.రూ.912 ఉంది. సిలిండర్ బుకింగ్, డెలివరీ బాయ్ తీసుకునే చార్జీ కలుపుకుంటే ఒక్కొ సిలిండర్‌కు దాదాపు రూ.1000 వరకు చెల్లించుకోవాల్సి వస్తోంది. జనవరిలో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.694 ఉంది. ఇప్పుడు అది ఏకంగా రూ.884కి చేరింది.