పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో, దేశీయ చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. శనివారం (మార్చి 7, 2026) నుంచి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ (14.2 కేజీల) ఎల్‌పీజీ సిలిండర్‌పై ₹60 పెరిగింది. ఈ పెంపుతో ఢిల్లీలో నాన్-సబ్సిడీ సిలిండర్ ధర ₹913కు చేరుకుంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వెబ్-సైట్ ప్రకారం, ఈ కొత్త ధరలు మార్చి 7 నుంచే అమల్లోకి వచ్చాయి. గత 11 నెలల్లో ధర పెరగడం ఇది రెండోసారి. అంతకుముందు గత ఏడాది ఏప్రిల్‌లో ₹50 పెరిగింది. ఇక ముంబైలో ఎల్పీజీ సిలిండర్ ధర ₹852.50 నుండి ₹912.50కి చేరింది. కోల్‌కతాలో ₹879 నుండి ₹939కి, చెన్నైలో ₹868.50 నుండి ₹928కి చేరింది.
పేద ప్రజల కోసం కేంద్రం అందించిన 10 కోట్లకు పైగా ఉజ్వల కనెక్షన్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వారికి పాత ధరలకే గ్యాస్ లభిస్తుంది. ఈ నెల ప్రారంభంలోనే హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ₹114.5 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో దీని ధర ₹1,883 గా ఉంది. పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎల్‌పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని రిఫైనరీలను కేంద్రం ఆదేశించింది. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి భరోసా ఇచ్చారు.