కాలుష్య నియంత్రణ చర్యలు పాటించకుండా, పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా వ్యవహరిస్తున్న కంపెనీలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) భారీ జరిమానాలు విధించింది. మూడు పెద్ద కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. ప్లాస్టిక్ బ్యాగులు, బాటిళ్ల సేకరణకు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంతో కోక్, పెప్సీ, బిస్లేరీ కంపెనీలపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆ మూడు కంపెనీలకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. రూ.72 కోట్ల జరిమానా విధిస్తూ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది.
బిస్లేరీ సంస్థకు రూ.10.75 కోట్లు జరిమానా విధించింది. బిస్లేరి కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం 9 నెలల్లో సుమారు 21,500 టన్నులుగా తేలింది. టన్నుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10.75 కోట్లు జరిమానా విధించింది.
పెప్సీకి రూ.8.7 కోట్లు జరిమానాను విధించింది. పెప్సీ సంస్థ దగ్గర 11,194 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. కోకాకోలా కంపెనీకి రూ.50.66 కోట్ల జరిమానా విధించింది. కోకాకోలా బెవరేజెస్ సంస్థలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 4,417 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి.
రాందేవ్ బాబాకు చెందిన పతాంజలి సంస్థకు రూ. కోటి రూపాయల జరిమానాను విధించారు. జరిమానాలను 15 రోజుల్లోగా చెల్లించాలని పీసీబీ స్పష్టం చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్స్‌బిలిటీ (ఈపీఆర్) అనేది పాలసీ కొలత. దీని ఆధారంగా ప్లాస్టిక్ వస్తువులను తయారుచేసే కంపెనీలు ఉత్పత్తులను పారవేసేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే భారీగా జరిమానాలను చెల్లించాల్సి వస్తోంది. ఒక్కో సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలను బట్టి జరిమానాను కాలుష్య నియంత్రణ మండలి విధించింది.