అత్యవసర సమయాల్లో చేతిలో డబ్బు లేకపోయినా.. ఏదైనా కొనేందుకు క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. గడువు తేదీలోపు బిల్లు పూర్తిగా చెల్లిస్తే సరిపోతుంది. కానీ, తరచూ బిల్లులు ఆలస్యంగా చెల్లించడం మంచి అలవాటు కాదు. ఇది మీ ఆర్థిక ప్రణాళికలకు ఇబ్బంది కలిగిస్తుంది. అదే సమయంలో వడ్డీ భారాన్ని కూడా పెంచుతుంది. ఇప్పటి వరకూ బ్యాంకులు, కార్డు సంస్థలు బాకీ ఉన్న మొత్తంపై గరిష్ఠంగా 30 శాతం వరకే వడ్డీ విధించేవి. కానీ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వడ్డీని తమ ఇష్టం ఉన్నంత విధించుకునే స్వేచ్ఛ వీటికి వచ్చింది. కాబట్టి, ఇక నుంచి కార్డు వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
రుసుములు, వడ్డీల భారం
బ్యాంకులు, కార్డు సంస్థలు కనీస మొత్తం వెలుసుబాటు ఇస్తుంటాయి. దీనిని చాలా మంది వినియోగించుకుంటారు. మిగతా మొత్తంపై ఎప్పటికప్పుడు వడ్డీ విధిస్తూ ఉండటంతో ఆ బాకీ పెరిగిపోతూనే ఉంటుంది. కొన్నిసార్లు రుసుములు, వడ్డీలు కలిసి మోయలేని భారంగా మారొచ్చు. కాబట్టి సకాలంలో బిల్లు చెల్లించే అవకాశం ఉంటేనే కార్డుతో కొనుగోళ్లు చేయండి. తరచూ చెల్లింపులు ఆలస్యం అవుతుంటే.. అది మీపై ఒత్తిడిని పెంచుతుంది. వ్యవధిలోపు బిల్లు చెల్లిస్తే.. డబ్బును కూడా ఆదా చేయొచ్చు. ఆలస్యపు రుసుములు, అధిక వడ్డీ రేట్ల వల్ల మీరు కష్టపడ్డ సొమ్ము కాస్తా వీటికే పెట్టాల్సి వస్తుంది. చెల్లింపులు ఆలస్యం అవుతుంటే.. కార్డు సంస్థ చట్టపరమైన చర్యలకు దిగే అవకాశం లేకపోలేదు. ఇది మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తుంది.