దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది. నష్టాలను ఆయిల్ కంపెనీలో భరించాలని స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కును దాటాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, బ్రెంట్ క్రూడ్ రెండూ కూడా 2022 తర్వాత మొదటిసారిగా 116 డాలర్లకు చేరుకున్నాయి.
అయినప్పటికీ, భారత్‌లో ఇప్పుడప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి పెరిగిన భారాన్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలే (OMCs) భరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఆయా సంస్థల లాభాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, సామాన్యులపై భారం పడకుండా పంప్ ధరలను ప్రస్తుతానికి యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు.
స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మీదుగా చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడటంతో ధరలు పెరిగినప్పటికీ, భారత్ వద్ద తగినంత ఇంధన నిల్వలు ఉండటం ఊరటనిచ్చే అంశం. చమురు దిగుమతుల కోసం భారత్ తన మార్గాలను వైవిధ్యపరుస్తోంది. గతంలో వ్యూహాత్మక షిప్పింగ్ మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వెలుపల నుండి 60 శాతం చమురు దిగుమతి చేసుకునే భారత్, ఇప్పుడు ఆ వాటాను 70 శాతానికి పెంచింది. దీనివల్ల సరఫరా వ్యవస్థలో స్థిరత్వం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా పెరిగిన చమురు ధరలను తాత్కాలికమేనని పేర్కొనడం గమనార్హం.