కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే సగటు మనిషి కోలుకుంటున్నాడు. బడ్జెట్‌లోనూ వేతన జీవులకు ఊరట దక్కలేదు. నిత్యం పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నసామాన్యుడికి కేంద్రం మరో షాకిచ్చింది. ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెంచేసింది. నాన్ సబ్సిడీ(రాయితీ లేని) సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపెనీలు నేడు నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.25 పెంచాయి. పెంచిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి.
రెండు నెలల క్రితం గ్యాస్ ధర రూ.650గా ఉండేది. ఆతరువాత ఒకే నెలలో రెండు సార్లు 50 చొప్పున రూ.100 ధర పెరిగింది. జనవరిలో గ్యాస్ ధరలు పెరగకపోవడంతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకుంటుండగా.. నేడు మరో రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు. దీంతో రెండు నెలల కాలంలో సిలిండర్ ధర రూ.125 పెరిగింది.
పెంపు తర్వాత దేశరాజధాని ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర (14.2 కిలోలు) రూ. 719కి చేరగా కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కి చేరింది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.746.50 నుంచి రూ.771.50 కి చేరింది.