కొత్త సంవత్సరం తొలి రోజున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. కమర్షియల్(వాణిజ్య) గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రెస్టారెంట్లు, చిరు వ్యాపారులకు కాస్త ఊరట లభించనుంది. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. అందులో భాగంగానే నేడు(శనివారం) 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై రూ.102 తగ్గింది. తగ్గిన ధర నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు చెప్పింది.
అయితే గృహ అవసరానికి వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. తాజా సవరణతో ఢిల్లీలో నేటి నుంచి వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,004కు తగ్గనుంది. కోల్‌కతాలో రూ.2,074.5, ముంబైలో రూ.1,951, చెన్నైలో రూ.2,134.50 గా ఉంది. ఇక ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కస్టమర్‌లు తాజా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను తెలుసుకోవచ్చు.
కాగా.. గత ఆరునెలల వ్యవధిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.400 వరకు పెరిగింది. చివరి సారిగా 2021 డిసెంబరు 1న రూ.100 పెరుగగా.. నేడు రూ.100 తగ్గింది.