ఈఎంఐల్లో వస్తువులు కొంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి

పండుగల సీజన్‌ ప్రారంభమైంది. ఈ నెల నుంచి ఒక పండగ తర్వాత మరో పండగ ఇలా జనవరి వరకు ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది.

By అంజి  Published on  8 Oct 2023 10:14 AM IST
Buying goods, EMI, festive season, Festive budget

ఈఎంఐల్లో వస్తువులు కొంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి

పండుగల సీజన్‌ ప్రారంభమైంది. ఈ నెల నుంచి ఒక పండగ తర్వాత మరో పండగ ఇలా జనవరి వరకు ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది. పండుగల సందర్భంగా ఈ కామర్స్ కంపెనీలు, ఆఫ్‌లైన్ కంపెనీలు ఊరించే ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు నేటి నుంచి ఆఫర్‌ సేల్స్‌ను ప్రారంభించాయి. ఎదైనా వస్తువు కొనుక్కోవాలంటే చాలా మంది పండగ సీజన్ ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇక ఈ కామర్స్‌ కంపెనీలు కూడా ధరల తగ్గింపుతో పాటు నో కాస్ట్‌ ఈఎంఐ, బై నౌ పే లేటర్‌ స్కీమ్‌లను ప్రవేశపెడుతున్నాయి. ఈ ఆఫర్లను చూసి జనాలు డబ్బులేకున్నా.. ఈఎంఐ రూపంలో వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ టైంలో ఆఫర్లకు టెంప్ట్ కావొద్దు. వస్తువులు కొనుగోలు చేస్తే.. తర్వాత డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడే ఛాన్స్‌ ఉంది. ఒక వేళ ఎదైనా వస్తువును కొనుక్కున్నా.. దానిని ఈఎంఐ పెట్టుకునేటప్పుడు పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

మొదట ఏయే వస్తువులు కొనాలనుకుంటున్నారో ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ సేల్స్ ప్రారంభం కావడాని కంటే ముందే ఒక అంచనా వేసుకోవాలి. దీనికి ముందుగానే బడ్జెట్‌ను పెట్టుకోవాలి. ఒకవేళ ఇలా బడ్జెట్‌ పెట్టుకోకపోతే, అనుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీ రోజువారీ అవసరాలకు, అత్యవసరాలకు డబ్బులను పక్కకు పెట్టుకోవాలి. మీరు కొనాలనుకున్న వస్తువుల ధరలు వివిధ వెబ్‌సైట్లలో ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. డీల్స్‌ను ఒకదానితో ఒకటి పోల్చి చూసుకోవాలి. ఏ ఆన్‌లైన్ వేదికపై ఎంత ఆఫర్ ప్రకటించారు? బ్రాండ్ ఏమిటి? ఇలా అన్నింటిపై ఒక అంచనాకు రావాలి.

ఆ తర్వాత వస్తువు ఆర్డరు పెట్టుకునే ముందే, క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా కొంటున్నప్పుడు ఏమైనా డిస్కౌంట్లు ఇస్తున్నారా? బ్యాంకు ఆఫర్లు ఏ విధంగా ఉన్నాయి? వంటివి చూసుకోవాలి. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, బై నౌ పే లేటర్ అంటూ పలు ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. పెద్ద వస్తువులను కొన్నప్పుడు చాలా మంది ఈఎంఐ పెడుతూ ఉంటారు. ఇక క్రెడిట్ కార్డులపై ఈఎంఐలను రెండు రకాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. కొనుగోలు చేసేటప్పుడే ఈకామర్స్ వెబ్‌సైట్‌లో ఇన్‌స్టాంట్‌గా ఈఎంఐ కన్వర్షన్ చేసుకోవచ్చు. లేదంటే ట్రాన్సాక్షన్‌ చేసుకున్న తర్వాత క్రెడిట్ కార్డు జారీ కంపెనీకి ఫోన్ చేసి బిల్లు జనరేట్ కావడాని కంటే ముందు ఈఎంఐ కన్వర్షన్ చేసుకోవచ్చు. అయితే డెబిట్ కార్డులు కేవలం డైరెక్ట్ ఈఎంఐ కన్వర్షన్‌కు మాత్రమే అనుమతి ఇస్తాయి.

ఒక వేళ నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కస్టమర్లు ప్రొడక్ట్‌ని కొనుగోలు చేస్తే.. ఆ ప్రొడక్ట్‌ ధరను మాత్రమే ఈఎంఐల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐల్లోకి మార్చుకున్నప్పుడు పడే ఏ వడ్డీని కూడా కస్టమర్లు ఈ విధానంలో చెల్లించాల్సిన అవసరం ఉండదు. వినడానికి ఇది ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేటు ప్రొడక్ట్ ధరలోనే కలిసి ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐలను ఎంపిక చేసుకున్నప్పుడు కొన్నిసార్లు కస్టమర్లు డిస్కౌంట్లను వదులు కోవాల్సి ఉంటుంది. ఒకే ప్రొడక్ట్‌పై వివిధ రకాల డిస్కౌంట్లను ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఆఫర్ చేస్తూ ఉంటాయి. నో కాస్ట్ ఈఎంఐలలో ప్రాసెసింగ్ ఫీజును కస్టమర్లపై బ్యాంకు ఛార్జ్ చేస్తుంది. ఈ విషయం కస్టమర్లకు తెలిసే అవకాశం ఉండదు. క్రెడిట్ స్కోరు 700 కంటే తక్కువ ఉన్న కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐను ఎంపిక చేసుకోలేరు.

ఇక ఈఎంఐ చెల్లింపులను సరైన సమయంలో చెల్లించాలి. లేదంటే మీ క్రెడిట్ స్కోర్లపై ప్రభావం పడుతుంది. నో కాస్ట్ ఈఎంఐలో చెల్లింపులను సరైన సమయంలో చేయకపోతే, ఆలస్యపు ఫీజులు, సర్‌ఛార్జీలు వంటి వాటిని కట్టాలి. అవసరం లేని వస్తువులను నో కాస్ట్ ఈఎంఐలలో కొనుగోలు చేయొద్దు. ఎందుకంటే.. ఇది మిమ్మల్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్టు చేస్తుంది.

Next Story