పిల్లల కోసం ఉత్తమ పెట్టుబడి పథకాలు.. పూర్తి వివరాలివే
పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు భావిస్తారు. అందుకోసం ఇప్పటి నుంచే పెట్టుబడి ప్రారంభిస్తారు.
By అంజి Published on 5 Aug 2024 5:37 AM GMTపిల్లల కోసం ఉత్తమ పథకాలు.. పూర్తి వివరాలివే
పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు భావిస్తారు. అందుకోసం ఇప్పటి నుంచే పెట్టుబడి ప్రారంభిస్తారు. అలాంటి వారి కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ చైల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
1.సుకన్య సమృద్ధి యోజన
కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం 2015లో సుకన్య సమృద్ధి యోజన అమల్లోకి తెచ్చింది. తమ కూతురి కోసం పొదుపు చేయాలనుకున్న తల్లిదండ్రులకు ఇది ఉత్తమమైన ఎంపిక. 10 ఏళ్ల వయస్సు లోపు ఆడ పిల్లల పేరుపై ఈ ఖాతాను తెరవవచ్చు. దీంట్లో పన్ను ప్రయోజనాలతో పాటు మంచి వడ్డీ లభిస్తుంది. రూ.250 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షలు పొదుపు చేయవచ్చు.
2. ఎన్‌పీఎస్ వాత్సల్య
తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పిల్లల కోసం ఎన్‌పీఎస్ వాత్సల్య అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. 18 ఏళ్ల లోపు బాల బాలికల పేరుతో తల్లిదండ్రులు ఖాతా తెరవొచ్చు. పిల్లలు మేజర్లు అయిన తర్వాత అది సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాగా మారిపోతుంది. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌కి ఉన్న నిబంధనలే ఈ పథకానికి కూడా వర్తిస్తాయి.
3. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్
ఈ పథకం ద్వారా కూడా పిల్లల పేరుతో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పొదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కీమ్‌లో మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే పొదుపు ప్రారంభించాక మూడేళ్ల వరకు ఆ డబ్బును ఉపసంహరించుకునేందుకు వీలు ఉండదు. అయితే ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ కాస్త ఎక్కువ అనిన గుర్తుంచుకోవాలి.
4. చైల్డ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్
పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా యూఎల్‌ఐపీ ప్లాన్స్ ఉంటాయి. అయితే ఇందులో కూడా లాక్ ఇన్ పీరియడ్‌లు ఉంటాయి. పిల్లల భవిష్యత్తు అవసరాలకు నిధులు అందించడంలో ఈ స్కీమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. పిల్లలకు 18 ఏళ్లు వచ్చాక చదువుల కోసం కొంత డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. సెక్షణ్ 80సీ ప్రకారం పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
వీటితో పాటు మ్యూచ్‌వల్ ఫండ్స్, ఇతర పోస్టాఫీస్ పథకాల ద్వారా పిల్లల కోసం పొదుపు చేయవచ్చు. వారి పేరుతో బ్యాంకుల్లో కొంత డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్స్ కూడా చేయవచ్చు.