రెండో రోజు కొనసాగుతోన్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
Bank employees continue strike against Privatisation on day 2.ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశ
By తోట వంశీ కుమార్ Published on 17 Dec 2021 9:51 AM ISTప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె శుక్రవారం కూడా కొనసాగుతోంది. ఈ సమ్మెలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులతో పాటు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని, దానిని అడ్డుకునేందుకే.. దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్టు బ్యాంక్ ఉద్యోగులు చెప్పుకొచ్చారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
రెండు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా గురు, శుక్రవారాలు బ్యాంకులు పూర్తిగా మూతపడ్డాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్‌తో సహా తొమ్మిది యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉంటున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తే 2008లో ఏవిధంగా అయితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందో అదే తరహాలో మరో సంక్షోభం వస్తుందని హెచ్చరించారు. కేంద్రం తక్షణమే ఈ చట్ట సవరణ ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని.. నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రెండో రోజు కూడా బ్యాంకులు సమ్మె చేస్తుండడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు.