బజాజ్ చేతక్.. 1970 నుంచి 1990వ దశకం వరకూ ఈ స్కూటర్ ఒక స్టార్ గా వెలిగింది. ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబం కల ఈ బైక్. భారత్ లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న స్కూటర్. ఆ తర్వాత వేరే మోడల్స్ రావడం.. కాలానికి అనుగుణంగా మార్పులు చేయకపోవడంతో చేతక్ పై బజాజ్ కంపెనీ పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఎలెక్ట్రిక్ బైక్స్ విషయంలో పలు కంపెనీల మధ్య పోటీ నెలకొంది. దీంతో బజాజ్ కంపెనీ చేతక్ ను ఎలెక్ట్రిక్ స్కూటర్ గా తీసుకుని వస్తోంది. పేరు మాత్రమే చేతక్ పెట్టారు.. ఎలక్ట్రిక్ వేరియంట్ గా తయారు చేసి, మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
ఈ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలను ప్రారంభిస్తూ, అడ్వాన్స్ బుకింగ్స్ ను ఈ నెల 13న సంస్థ ప్రారంభించగా భారీ రెస్పాన్స్ వచ్చింది. తొలి విడతలో సంస్థ డెలివరీ చేయాలని భావించిన స్కూటర్ యూనిట్ల సంఖ్యతో పోలిస్తే, అధికంగా బుకింగ్స్ 48 గంటల వ్యవధిలోనే వచ్చాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సంస్థ వాటి బుకింగ్స్ ను ఆపేసింది. రెండు వేరియంట్లలో స్కూటర్ విడుదల అయ్యింది. ప్రీమియమ్ ధరను రూ. 1.26 లక్షలుగా, అర్బేన్ ధరను రూ. 1.22 లక్షలుగా ( ఆన్ రోడ్ ధర - పూణె) సంస్థ నిర్ణయించింది. ఈ స్కూటర్ 3.8 కిలోవాట్ పవర్ తో పని చేస్తుంది. 16.2 ఎన్ఎం పీక్ టార్క్, 1,400 ఆర్పీఎంను అందిస్తుంది. గంటకు 70 కిలోమీటర్ల వరకూ వేగంతో వెళుతూ, ఒకసారి చార్జింగ్ తో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
పూణె, బెంగళూరు నగరాల్లో మాత్రమే తాము బుకింగ్స్ ఓపెన్ చేశామని, సాధ్యమైనంత త్వరలోనే బుక్ చేసుకున్న కస్టమర్లకు వాహనాలను అందిస్తామని బజాజ్ సంస్థ తెలిపింది. బుకింగ్స్ ను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం తనను బాధించిందని సంస్థ తెలిపింది. బుకింగ్ చేసుకున్న బైక్ రావాలంటే మూడు నెలలు పడుతుంది.