విమాన ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి.. కిలోలీటర్ రూ.లక్ష పైనే
Aviation Turbine Fuel Price hiked by Steepest ever 18% to all time high.విమాన ప్రయాణం ఇక నుంచి మరింత ప్రియం కానుంది.
By తోట వంశీ కుమార్ Published on 16 March 2022 9:23 AM GMTవిమాన ప్రయాణం ఇక నుంచి మరింత ప్రియం కానుంది. పెరుగుతున్న ఇంధన ధరలే అందుకు కారణం. బుధవారం ఒక్క రోజే 18 శాతానికి పైగా పెరిగాయి. దీంతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కిలో లీటర్ ఇంధన ధర రూ.లక్ష దాటింది. అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్టస్థాయికి చేరడం విమాన ధరలపైన తీవ్ర ప్రభావం చూపించింది.
ఎయిర్ టర్బైన్ ఇంధనం ( ఏటీఎఫ్ ) ధరలను ప్రతి నెల 1, 16 తేదీల్లో సవరిస్తుంటారు. ఈ నేపథ్యంలో నేడు ధరలను సవరించారు. కిలోలీటర్ ఏటీఎఫ్ పై రూ.17,135 పెరిగింది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,10,666కి చేరుకుంది. ముంబయిలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.109,119, కోల్కతాలో రూ.114,980, చెన్నైలో రూ. 114,134గా ఉంది.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి చేపట్టిన తరువాత సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయంతో అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 140 డాలర్లకు చేరి 14 సంవత్సరాల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లుకు దిగొచ్చింది. అయినప్పటికీ విమాన ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఇలా ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది ఆరవసారి. జనవరి నుంచి ఇప్పటి వరకు ఏటీఎఫ్ ధర రూ.50శాతం పెరగడం గమనార్హం. 2008 బ్యారెల్ చమురు ధర రికార్డు స్థాయిలో 147 డాలర్లు ఉన్నప్పుడు కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.71,028గా ఉంది.
విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం ఇంధనం కోసం వెచ్చిస్తుంటాయి కంపెనీలు. ఇక విమాన ఇంధన ధరలు పెరుగుతండడంతో విమాన టికెట్ల ధరలను పెంచాయి దేశీయ విమాన కంపెనీలు. నాలుగు వారాల్లో దేశీయ రంగంలోని కొన్ని ప్రధాన మార్గాల్లో విమాన ఛార్జీలు 15 నుంచి 30 శాతం మేర పెరిగాయి.