బ్యాంకు ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌.. నేటి నుంచి అమ‌ల్లోకి రానున్న కొత్త నిబంధ‌న‌లు

Auto Debit Rules to Change From 1 October.హ్యాక‌ర్ల నుంచి ఫ్రాడ్ లావాదేవీల నుంచి బ్యాంకు ఖాతాదారుల‌ను ర‌క్షించేందుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2021 8:42 AM IST
బ్యాంకు ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌.. నేటి నుంచి అమ‌ల్లోకి రానున్న కొత్త నిబంధ‌న‌లు

హ్యాక‌ర్ల నుంచి ఫ్రాడ్ లావాదేవీల నుంచి బ్యాంకు ఖాతాదారుల‌ను ర‌క్షించేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేపడుతోంది. అందుకు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు నిబంధ‌న‌ల్లో మార్పులు చేస్తూ వ‌స్తోంది. ఆటో డెబిట్‌, పెన్ష‌న్, మ్యుచువ‌ల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్, కొత్త చెక్‌బుక్‌లు, ఏటీఎంల‌కు సంబంధించిన ప‌లు విష‌యాల్లో నేటి నుంచి నూత‌న నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్నాయి. ఆర్‌బీఐ సూచించిన రూల్స్‌ ప్రకారం పనులు పూర్తి కాకపోతే ఈ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

కొత్త చెక్‌బుక్‌లు..

అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ల‌కు సంబంధించిన పాత చెక్ బుక్‌లు ప‌నిచేయ‌వు. ఈ విషయంపై ఖాతాదారుల‌కు పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు కొంత‌కాలంగా అప్ర‌మ‌త్తం చేస్తూనే ఉంది. ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ లు పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌లో వీలినం చేశారు గ‌నుక‌.. ఆయా బ్యాంకు ఖాతాదారులంతా పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌లో కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఆటో డెబిట్ చెల్లింపు..

ఈఐఎంలు, విద్యుత్ బిల్లులు, ఎల్ఐసీలు లేదా ఇత‌ర చెల్లింపుల కోసం మీరు ఆటో డెబిట్ ఆప్ష‌న్‌ను ఎంచుకుని ఉంటే.. ఈ విధానంలో కొన్ని మార్పులు వ‌చ్చాయి. ఇక‌పై మీ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ కావాలంటే ప్ర‌తిసారి మీ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. మీరు అనుమ‌తి ఇవ్వ‌కుంటే స‌ద‌రు ట్రాన్సాక్ష‌న్ జ‌రుగ‌దు.

ఏటీఎం కొత్త రూల్స్‌..

ఏటీఎంల్లో న‌గ‌దు కొర‌త‌ను నివారించే ఆర్‌బీఐ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఏటీఎంల్లో న‌గ‌దు లేన‌ట్లైయితే.. స‌ద‌రు బ్యాంకుల‌కు ఆర్‌బీఐ ఫైన్ వేస్తుంది. ఒక ఏటీఎంలో ఒక నెల‌లో 10గంట‌ల‌కు పైన న‌గ‌దు లేన‌ట్లైయితే.. ఆ బ్యాంకు కు రూ.10వేల చొప్పున జ‌రిమానా విధించ‌నుంది.

పెన్షన్‌..

80 ఏళ్లు పైబడినవారు ఇకపై పెన్షన్‌ను సక్రమంగా అందుకోవాలంటే నేటి నుంచి డిజిటల్‌ ఫార్మాట్‌లో జీవన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇండియన్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ అన్ని హెడ్‌ పోస్టాఫీసుల్లో జీవన్‌ ప్రమాణ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇన్వెస్ట్‌మెంట్స్‌..

అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు అంటే మ్యూచువల్ ఫండ్ హౌజ్‌లల్లో పనిచేసే జూనియర్ స్థాయి ఉద్యోగులు తమ గ్రాస్ సాలరీలో 10 శాతాన్ని మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ కొత్త రూల్స్ ప్రకటించింది. అక్టోబర్ 1న ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి.

Next Story