ప్లాట్ లోన్ తీసుకుంటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
బ్యాంకులు కేవలం గృహ రుణాలే కాదు.. ప్లాట్ల కొనుగోలుకు కూడా రుణాలు ఇస్తాయి. వీటినే ప్లాట్ లోన్లు, రియల్టీ లోన్ అంటారు.
By అంజి Published on 9 March 2025 10:00 AM IST
ప్లాట్ లోన్ తీసుకుంటున్నారా?
బ్యాంకులు కేవలం గృహ రుణాలే కాదు.. ప్లాట్ల కొనుగోలుకు కూడా రుణాలు ఇస్తాయి. వీటినే ప్లాట్ లోన్లు, రియల్టీ లోన్ అంటారు. వీటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్లాట్ ఉన్న ప్రాంతం, రుణ గ్రహీత క్రెడిట్ హిస్టరీ, ఆదాయం, ఇప్పటికే ఉన్న రుణాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. ప్లాట్ విలువలో 80 శాతం వరకు లోన్ ఇస్తాయి. ఇవి కాస్త రిస్క్‌తో కూడుకున్నవి కావడంతో జాబ్ హోల్డర్స్, బిజినెస్ చేసేవారికే ఎక్కువగా ఈ లోన్లను మంజూరు చేస్తాయి. పైగా కొందరు వీటిని బ్యాంకుకు తెలియకుండా అమ్మేస్తుండటంతో బ్యాంకులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
భూమికి సంబంధించిన టైటిల్ డీడ్, సేల్ డీడ్, ఎన్‌వోసీ వంటి వాటిని చెక్ చేసిన తర్వాతే లోన్లు మంజూరు చేస్తున్నాయి. ప్లాట్ లోన్ నిబంధనలు బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు వీటిని హోంలోన్‌లోని ఓ విభాగంగా పరిగణిస్తాయి. కచ్చితంగా ఇంటిని నిర్మిస్తామన్న హామీ ఇస్తేనే రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. తక్కువ వడ్డీతో వచ్చే ఈ రుణాలను తీసుకుని ప్లాట్ కొని, ఎక్కువ మొత్తానికి అమ్మేస్తుండటంతో బ్యాంకులు నిబంధనలను కఠినతరం చేశాయి. రుణం ఇచ్చిన తర్వాత ఇంటిని నిర్మించుకోవడానికి కాస్త గడువునిస్తాయి. ఆ సమయంలోగా నిర్మాణం పూర్తి చేసినట్టు పత్రాలు సమర్పిస్తే తక్కువ వడ్డీరేటునే కొనసాగిస్తాయి. లేదంటే హోంలోన్‌ను సాధారణ రుణం కింద మార్చి వడ్డీరేటును వసూలు చేస్తాయి. పైగా లోన్ తీసుకున్నప్పటి నుంచి కొత్త రేటును వర్తింపజేసి ఆ మొత్తాన్ని లోన్‌కి యాడ్ చేస్తాయి.
అలాగే లోన్ పూర్తి చేయకుండా ప్లాట్‌ను మధ్యలో విక్రయించడానికి వీలు లేదు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం ప్లాట్ కొనడానికే అన్న నిబంధనతోనే రుణాలు ఇస్తున్నాయి. ఇది రుణదాత, గ్రహీత మధ్య కుదిరిన ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి అమ్మకాలను నిషేధించడానికే సేల్ డీడ్‌ను బ్యాంకులు హామీగా పెట్టుకుంటున్నాయి. ఇది లేకుండా ప్లాట్‌ను అమ్మలేరు. ఒక వేళ నకిలీ పత్రాలు సృష్టించి అమ్మినట్టు తెలిస్తే బ్యాంకులు చట్టరీత్యా చర్యలకు ఉపక్రమించే వీలు ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటేనే ప్లాట్ లోన్ తీసుకోవడం మంచిది.