ప్రాపర్టీ క్రయ విక్రయాల్లో భాగంగా డబ్బు భారీగా చేతులు మారుతుంది. పెద్ద అమౌంట్‌ను 'నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 2' ప్రకారం.. కొంత చెక్, ఆన్‌లైన్ పేమెంట్, క్యాష్ రూపంలో ఇస్తుంటారు. అయితే చెక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో చెక్ బౌన్స్ కావచ్చు. కొంతమంది తమ అకౌంట్‌లో డబ్బు లేకున్నా.. చెక్ రాసిచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తే క్రిమినల్ కేస్ అవుతుంది. ఎవరైనా ఈ తరహా మోసాలకు పాల్పడితే, చెక్ బౌన్స్ అయితే బ్యాంకును సంప్రదించి అకౌంట్‌లో డబ్బు లేదని 'రిటన్ మెమో' తీసుకోవాలి.
ఆ తరువాత అడ్వకేట్ నుంచి నిందితులకి నోటీసులు పంపించాలి. అప్పటికీ తగు వివరణ ఇవ్వకపోతే ఆ బ్యాంక్ బ్రాంచి పరిధిలోని కోర్టులో కేస్ ఫైల్ చేయవచ్చు. కోర్టుకు విచారణకు కూడా హాజరుకాకుంటే.. నిందితులపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది. కాబట్టి ప్రాపర్టీ విషయంలో చెక్ ఇవ్వడానికి, తీసుకోవడానికి ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముందుగానే చెక్‌ను బ్యాంక్‌కు తీసుకెళ్లి పరిశీలించుకోవడం మరింత ఉత్తమం.