క్రెడిట్ కార్డ్ బిల్ 'మినిమిమ్' కడుతున్నారా?
క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేటప్పుడు కచ్చితంగా మినిమమ్ బిల్ అని కనబడుతుంది. ఆ తక్కువ మొత్తం ఆకర్షించేలాగే ఉంటుంది.
By అంజి Published on 19 Feb 2024 11:34 AM ISTminimum credit card bill, credit card, Banks
క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేటప్పుడు కచ్చితంగా మినిమమ్ బిల్ అని కనబడుతుంది. ఆ తక్కువ మొత్తం ఆకర్షించేలాగే ఉంటుంది. మినిమమ్ కట్టి పూర్తి భారం వచ్చే నెలలో చూసుకుందామనుకుంటారు. ఇదే క్రెడిట్ కార్డ్ హోల్డర్ చేసే పెద్ద తప్పని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవును ఎందుకంటే మినిమమ్ కట్టిన తర్వాత మరుసటి నెలలో.. కొనుగోలు చేసిన మొదటి రోజు నుంచే వడ్డీ పడుతుందన్న విషయం తెలుసుకోవాలి. అందుకే క్రెడిట్ కార్డ్ నిప్పులాంటిదని సంబోధిస్తుంటారు.
క్రెడిట్ కార్డ్‌ని సరిగా ఉపయోగించుకుని దీపం వెలిగించుకుంటావో.. లేదా గుడిసె తగలబెట్టుకుంటావో అనేది వినియోగించకునే దాన్ని బట్టి ఉంటుందని దాని అర్థం. ఎప్పటి బిల్ అప్పుడే కట్టేస్తే క్రెడిట్ స్కోర్ హెల్తీగా ఉంటుంది. డబ్బులు సర్తుబాటు అవ్వకపోతే ఏడాదిలో ఒకటి రెండు సార్లు మినహా మినిమమ్ కట్టకపోవడం మేలు. ప్రతి నెలా ఇలాగే కట్టుకుంటూ పోతే.. భారీ వడ్డీతో పీకల్లోతూ అప్పుల్లోనే కాకుండా, బ్యాంకులతో మీ సంబంధాలు చెడుతాయని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డును ఎలా ఉపయోగించాలో, బ్యాంకులు వడ్డీ ఎలా విధిస్తాయో తెలుసుకుందాం..
క్రెడిట్ కార్డుపై ఉపయోగించిన మొత్తం బిల్ జనరేట్ అయ్యాక 5 శాతం మినిమమ్ కట్టాల్సి ఉంటుంది. అంటే రూ.10 వేల బిల్లు ఉందనుకుందాం.. మినిమమ్ 5 శాతం రూ.500 కట్టారనుకుంటే.. మిగతా రూ.9,500 మరుసటి నెలలో బిల్లుకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కానీ మొత్తం రూ.10 వేలకు బ్యాంకులు, కార్డు సంస్థను బట్టీ వడ్డీ విధిస్తాయి. ఇది 36 నుంచి 48 శాతం వరకు ఉంటుంది. కాబట్టి మినిమమ్ కట్టేటప్పుడు దీనిని పరిగణనలోకి తీసుకుని చెల్లించండి. ఇలాగే కట్టుకుంటూ పోతే ఆ అప్పు అలాగే ఉంటుంది. వడ్డీలు, ఆలస్యరుసుము ఒకదానికొకటి జతై అలా పెరుగుతూ.. దీర్ఘకాలంలో నష్టాన్ని మిగులుస్తాయి. అలాగే మొత్తం కార్డు లిమిట్ నుంచి 30 - 40 శాతానికి మించి వాడకుండా జాగ్రత్త వహించాలి.