క్రెడిట్ కార్డు ద్వారా ఏ సమయంలోనైనా వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అయితే నిర్ణీత సమయంలోగా బిల్ పే చేయకపోతే అధిక శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మినిమమ్ డ్యూ అమౌంట్ పే చేసినా కూడా ఈ ఛార్జీలను భరించక తప్పదు. అంతేకాదు క్రెడిట్ స్కోర్‌పైనా ప్రభావం పడుతుంది.
ఈ నేపథ్యంలోనే బ్యాంకులన్నీ క్రెడిట్ కార్డు బిల్లుల్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాయి. ఈ విధానం ఉపయోగకరమే అయినప్పటికీ.. అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకుని బట్టి 15 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి రావొచ్చు. దీనికి ఒకే అనుకుంటేనే ఈఎంఐ ఆప్షన్ తీసుకోవాలి. ఈ విధానంలో కొనుగోలు చేసే మొత్తం అమౌంట్ కూడా కార్డు లిమిట్ నుంచి బ్లాక్ అవుతుందని గుర్తుంచుకోండి.
ఆన్‌లైన్ కొనుగోళ్లలో నో కాస్ట్ ఈఎంఐ కూడా లాభదాయకమే అయినప్పటికీ అదనపు ఛార్జీల విషయంలో జాగ్రత్త అవసరం. బకాయిల్ క్లియర్ చేసే వరకు మరిన్ని కొనుగోళ్లు తగ్గించండి. ఏదేమైనా క్రెడిట్ కార్డు వాడకంలో బిల్లులు సమయానికి చెల్లించడం, ఈఎంఐ ఆప్షన్‌ను దూరం పెట్టడం ఉత్తమం.