ఓపెన్ ఎండెడ్ మార్ట్‌గేజ్ లోన్ ఆప్షన్ ఎంపిక చేసుకున్న రుణగ్రహీత.. ఒక రుణం పొందిన కొన్ని రోజుల తర్వాత మరింత రుణం కావాలని బ్యాంకును కోరవచ్చు. బ్యాంకు కూడా అందుకు సమ్మతిస్తుంది. సాధారణంగా ఇల్లు వంటి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఈ విధానం పని చేస్తుంది. ఇల్లు కొనుగోలుకు మంజూరు చేసిన మొత్తం రుణం ఒకేసారి తీసుకోకుండా మొదట అవసరం ఉన్నంత మేరకు రుణం తీసుకొని, భవిష్యత్‌లో మరింత నిధుల అవసరం ఉన్నప్పుడు బ్యాంకును అభ్యర్థించి అదనపు రుణాన్ని పొందటం ఈ విధానం ముఖ్య ఉద్దేశం.
దీంతో అవసరం లేకపోయినా బ్యాంక్ శాంక్షన్ చేసిన మొత్తం రుణాన్ని ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే అదనంగా వడ్డీ చెల్లించనక్కరలేదు. అదే సమయంలో అవసరమైనప్పుడు కూడా ఎలాంటి రిస్క్ ఉండదు. ఎందుకంటే ఒక స్థిరాస్థి ఎలాగూ తనఖాలో ఉంటుంది. పైగా దాని విలువ కొనుగోలు నాటి నుంచి చూస్తే రోజులు గడుస్తున్న కొద్దీ మరింత పెరుగుతుంది. కాబట్టి ముందే శాంక్షన్ చేసిన పూర్తి రుణం మొత్తం ఎన్ని దఫాలుగా అయినా ఇచ్చేందుకు బ్యాంకుకు అభ్యంతరం ఉండదు.