త్వరలో హైదరాబాద్‌లో యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ

మరో యాపిల్‌ ఉత్పత్తిని హైదరాబాద్లోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు.

By Srikanth Gundamalla  Published on  15 Aug 2023 6:29 PM IST
apple airpods, foxconn Factory, Hyderabad ,

 త్వరలో హైదరాబాద్‌లో యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ

హైదరాబాద్‌ నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఎన్నో దిగ్గజ కంపెనీలో ఇక్కడ ఆఫీసులను తెరిచాయి. అయితే.. తమిళనాడులో ఉన్న ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో యాపిల్‌ ఐఫోన్‌లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో యాపిల్‌ ఉత్పత్తిని హైదరాబాద్లోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. దీనికి కోసం భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిసింది. ఫాక్స్‌కాన్ కంపెనీ 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

హైదరాబాద్‌లో ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడే యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీకి కంపెనీ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 2024 నుంచి ఫాక్స్‌కాన్‌ హైదరాబాద్‌ యూనిట్‌లో వీటిని తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తమిళనాడులో ఐఫోన్‌లను ఫాక్స్‌కాన్‌ కంపెనీ తయారు చేస్తోంది. దాని తర్వాత యాపిల్‌కు చెందిన మరో ఉత్పత్తులు తయరుచేయడం ఇదే తర్వాతిది అని ప్రతినిధులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఫాక్స్‌కాన్‌ భారత ప్రతినిధి వి లీ తెలంగాణలో 400 మిలియన్‌ పెట్టుబడులు పెట్టనున్నట్లు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. అప్పుడు 150 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అయితే.. ఇది అదనమని వెల్లడించారు. దీంతో ఫాక్స్‌కాన్‌ సంస్థ మొత్తంగా 550 మిలియన్‌ డాలర్లు హైదరాబాద్‌ ప్లాంట్‌లో పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలుస్తుంది.

యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌కు ప్రస్తుతం మార్కెట్‌లో ఎంతో డిమాండ్ ఉంది. వినియోగదారులు వాటిని వాడేందుకు ఎంతో ఇష్టపడుతుంటారు. ఇయర్‌బడ్స్ విభాగంలో ఎయిర్‌పాడ్స్ వాటా 36 శాతం ఉంది. వీటి తర్వాత శాంసంగ్‌ 7.6 శాతం, షావోమి 4.4 శాతం, బోట్‌ 4 శాతం, ఒప్పో 6 శాతం మార్కెట్‌ వాటాను కలిగివున్నాయి. అయితే.. భారత్‌లో ఫాక్స్‌కాన్‌, పెగట్రాన్ కార్పొరేషన్, విస్ట్రన్ కార్పొరేషన్లు ఐఫోన్‌లోని వివిధ రకాల మోడల్స్‌ను తయారు చేస్తున్నాయి. దాంతో.. ఈ కంపెనీల ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. తాజాగా.. ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఎయిర్‌పాడ్స్‌ తయారీ చేయడం ద్వారా కూడా మరికొందరికి ఉపాధి దొరుకుతుంది. అలాగే హైదరాబాద్‌ మార్కెట్‌ కూడా మరో అడుగు ముందుకు వేసినట్లు అవుతుంది.

Next Story