సామాన్య ప్రజలకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశనంటుతున్న వేళ.. తాజాగా అమూల్, మదర్ డెయిర్ సంస్థలు పాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. అముల్ డెయిరీ సంస్థ లీటర్ పాలపై రెండు రూపాయలు పెంచింది. తయారీ ఖర్చులు పెరగడం వల్లే పాల ధరను పెంచినట్లు అముల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంధనం, రవాణా, పశువుల దాణా ఖర్చులు పెరిగాయని, ఫలితంగా పాల ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు ఎక్కువయ్యాయని, అందుకే పాల ధర పెంచాల్సి వచ్చిందని అముల్ డెయిరీ చెప్పింది.
రూ.2 పెంపుతో అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతా, ముంబైతో సహా అన్ని మార్కెట్లలో అమూల్ గోల్డ్ మిల్క్ అర లీటరు ధర రూ.31కు చేరుకోనుంది. అమూల్ తాజా మిల్క్ ధర రూ.25 కాగా.. అమూల్ శక్తి పాల ప్యాకెట్ ధర రూ.28కు పెరగనుందని అమూల్ తెలిపింది. లీటరుపై రెండు రూపాయలు పెంచడం అంటే, ఎంఆర్పీపై రూ.4 పెరిగినట్లు అని ఆ సంస్థ తన ప్రకటనలో చెప్పింది. పాల ధరను పెంచడం వల్ల పాల ఉత్పత్తిదారులకు భరోసా ఇచ్చినట్లు అవుతుందని ఆ సంస్థ తెలిపింది.
మదర్ డెయిరీ బ్రాండ్ పాలు కూడా మరింత ప్రియం కానున్నాయి. బుధవారం నుంచి లీటరు పాల ధరను రూ.2 మేర పెంచుతున్నట్లు మదర్ డెయిరీ ప్రకటించింది. కొత్త ధరలు అన్ని రకాల మదర్ డెయిరీ పాలకు వర్తిస్తాయని చెప్పింది. దీంతో మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర రేపటి నుంచి రూ.61 చేరుకోనుంది. డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటరు రూ.45కు, బల్క్ వెండెడ్ మిల్క్ ధర లీటరు రూ.48కు పెంచామని మదర్ డెయిరీ కంపెనీ తెలిపింది. గత ఐదు నెలల్లో కంపెనీ ఇన్‌పుట్ ఖర్చులు సుమారు 10-11 శాతం పెరిగాయని, అందుకే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.