ఆర్థిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు అన్నీ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వ్యయ నియంత్రణను పాటిస్తున్నాయి. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అర్థం కానీ పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఇప్పటికే పలువురిని ఉద్యోగాల నుంచి తీసివేసిన అమెజాన్ తాజాగా మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది.
సంస్థలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9 వేల మందికి ఉద్వాసన పలకనున్నట్లు కంపెనీ సీఈవో యాండీ జెస్సీ ఓ ప్రకటనలో తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత అస్థిరత నెలకొనే అవకాశం ఉంది. కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇది చాలా కఠిన నిర్ణయం. అయినప్పటికీ తప్పడం లేదు. దీర్ఘకాలంలో కంపెనీ విజయానికి ఇది చాలా కీలకం. అని అన్నారు. ఈ నిర్ణయం కంపెనీ చరిత్రలో ఐదో అతి పెద్ద తొలగింపు కానుంది.
తాజా లేఆఫ్స్ తో నాలుగు నెలల్లోనే అమెజాన్ 27,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించినట్టయింది. ఒక పక్క ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ మరోపక్క కొత్త నియామకాలు ఆగవని యాండీ జెస్సీ తెలిపారు. అయితే ఆ నియామకాలు వ్యూహాత్మకంగా కీలకమైన విభాగాల్లో మాత్రమే ఉంటాయన్నారు.