దేశ ప్రజలంతా 2021-22 బడ్జెట్‌పై ఎన్నో ఆసలు పెట్టుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా నష్టపోవడంతో.. సామాన్యులకు బడ్జెట్ ద్వారా ఊరట లభించనుందని వార్తలు వినిపించడంతో బడ్జెట్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూశాడు. అయితే.. సామాన్యుడికి ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. భారీ షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలపై సెస్ పేరుతో మరింత భారం వేసింది. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ పేరుతో పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.4 సెస్ విధించారు.
దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. రోజువారీ ధరల సమీక్ష అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీ రోజూ పెరుగుతూనే ఉన్నాయి. గత పదిరోజుల్లోనే దాదాపు రెండు రూపాయలు పెరిగాయి. ముంబయిలో లీటర్ పెట్రోలు 93 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించిన సెస్ అమల్లోకి వస్తే.. పెట్రోల్ ధర వంద రూపాయలు దాటడం ఖాయం.
ఇక మద్యం ఉత్పత్తులపై 100శాతం, ముడిపామాయిల్‌పై 17.5శాతం, సోయాబీన్, పొద్దు తిరుగుడు ముడి నూనెపై 20శాతం, యాపిల్‌పై 35శాతం, బంగారం, వెండిపై 2.5శాతం చొప్పున, బఠానీలపై 40శాతం, కాబూలీ శనగలపై 30శాతం, శనగలపై 50శాతం, పత్తిపై 5 శాతం అగ్రి ఇన్‌ఫ్రాసెస్ విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. దీంతో ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది.