బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తంతో..

By Newsmeter.Network
Published on : 13 March 2020 9:54 AM IST

బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తంతో..

పెను ప్రమాదం తప్పింది. ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్‌ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించడంతో ఇవి కొద్దికొద్దిగా పెరిగి బస్సు పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్‌కు ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు 26మంది ప్రయాణీకులతో వస్తుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సమీపంలోకి రాగానే బస్సు ఇంజన్‌ భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఇది గమనించిన డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కకు ఆపి ప్రయాణీకులను అప్రమత్తం చేశాడు. అప్పటికే ఉదయం కావటం.. ప్రయాణికులు నిద్రలో ఉండటంతో డ్రైవర్‌ కేకలు విన్న వారు ఉలిక్కిపడి లేచారు. బస్సులో మంటలు వ్యాపిస్తున్నాయని తెలుసుకొని పరుగున బస్సు దిగి ప్రాణాలను కాపాడుకున్నారు. బస్సులోని 26మంది సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా బస్సుకు మంటలు వ్యాపించి ప్రయాణికులు చూస్తుండగానే పూర్తిగా దగ్గమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనలాస్థలికి చేరుకొని ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

హైవేలపై పలు సార్లు బస్సులో మంటలు రావటం జరిగింది. పలు ఘటనల్లో ప్రయాణికులు మృతిచెందిన ఘటనలు ఉన్నాయి. పలుసార్లు గాయాలతో బయటపడ్డ ఘటనలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటనలో డ్రైవర్‌ అప్రమత్తతతో వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Next Story