ఒక మాస్క్‌.. మూడు భాషలు

By మధుసూదనరావు రామదుర్గం  Published on  23 Aug 2020 1:40 PM GMT
ఒక మాస్క్‌.. మూడు భాషలు

భారతీయ చరిత్రలో మధ్యప్రదేశ్‌ది ప్రత్యేక స్థానం. భాష,సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. గొప్ప సంగీతానికి, పురాతన కట్టడాలకు మధ్యప్రదేశ్‌ పెట్టింది పేరు. ఎందరో సామ్రాట్టులు ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా పాలించారు. సామ్రాట్‌ ఆశోక్, చంద్రగుప్త అక్బర్‌ తదితర మహారాజులు పాలించిన నేల ఇది. భిన్నత్వంలో ఏకత్వంలా ఈ ప్రాంతంలో వివిధ మతాలు, విభిన్న సంప్రదాయాలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు అత్యంత సామసర్యతతో జీవిస్తుంటారు. ఇక్కడ తాన్‌సేన్‌ లాంటి సంగీత విద్వాంసులు తమ సంగీత విద్యతో సామరస్యాన్ని ప్రబోధించారు.

ఇండోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో అంతగా ప్రాచుర్యంలో లేని చిన్న పట్టణం బుర్హన్‌పూర్‌లో జామా మసీద్‌ పేరిట వెలిసిన మాస్క్‌ చారిత్రక ప్రత్యేకతను చాటుతోంది. ఈ జామా మసీదు గోడలపై అరబిక్, పర్షియన్, సంస్కృత భాషల్లో శాసనాలు.. నాటి రాజుల పాలనకు ఆనవాళ్ళుగా కనిపిస్తున్నాయి. 1588లో రాజా అలీ ఖాన్‌ ఈ జామా మసీద్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. దేశంలో మూడుభాషల్లో శాసనాలు కలిగిన ఏకైక కట్టడం ఈ జామా మసీదు మాస్క్‌ మాత్రమే.

సాధారణ పైకప్పు కాకుండా కమాను ఆకృతిలో నిర్మించిన ఈ మసీదు పర్యాటకుల్ని ఆకట్టుకుం టోంది. మసీదు ముందర 15 కమాను ఆకృతులు.. వాటికి ఇరువైపులా రెండు మినార్‌లు (స్తంభంలా పొడు గైన) ఉన్నాయి. మండు నుంచి నల్లని రాళ్ళను ఈ కట్టడాల కోసం దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. మసీదులో 17 ప్రార్థన గోడలు ఉన్నాయి. ఒక గోడపై అరబిక్‌లో ఖురాన్‌ వాక్యాలుంటాయి. ఇందులో కట్టడం నిర్మించిన సంవత్సరం రాసి ఉంది. శాసన రచయిత ముస్తాఫా పేరు కూడా ఉంది.

వీటితోపాటు దక్షణ వైపు చివరన ఉన్న ఓ గోడపై సంస్కృతంలో హిందూ సంవత్సరం తిథి వారం తెలిపే కేలండర్‌ ఉంది. పర్షియన్‌ భాషలో మహారాజు అక్బర్‌కు రాసిన సూచన కూడా కనిపిస్తుంది. అక్బర్‌ 1601లో బుర్హన్‌పుర్‌కు వచ్చినట్టు రాసి ఉంది. అసిర్గడ్‌ కోటను అక్బర్‌ జయించిన తర్వాత మహమ్మద్‌ మాసూమ్‌ ఈ శాసనం రాసినట్టు తెలుస్తోంది. జామా మసీదు నిర్మాణం ఫరూకీ వంశస్తుల పాలనలో ప్రారంభమైంది. అయితే నిర్మాణం చాలా ఏళ్లపాటు కొనసాగింది. ఫరూకీ వంశంలోని చిట్ట చివరి నాయకుడు అదిల్‌షా అస్తమయం తర్వాత కూడా నిర్మాణం కొనసాగింది. తదనంతరం అక్బర్‌ ఈ మసీదు పనులను పర్యవేక్షించి నిర్మాణం పూర్తి చేయించారు.

తొలుత తాజ్‌మహల్‌ కోసం:

బుర్హన్‌పూర్‌ను 8,9 శతాబ్దాల్లో రాష్ట్రకూటులు పాలించారు. పురా తవ్వకాల్లో తపతీనది, అసిర్‌ఘర్‌ కోట వద్ద ఎన్నో నాణేలు, దేవుళ్ళ విగ్రహాలు, ఆలయ శకలాలు వెలుగు చూశాయి. అయితే ఈ పట్టణానికి 14వ శతాబ్దంలోని మొఘల్‌ పాలనలో చారిత్రక ప్రాధాన్యం దక్కింది. మొఘల్‌ రాజులు పాలనా కాలంలోనే బుర్హన్‌పూర్‌ను ఫరూకీ వంశస్తులు అక్బర్, జహంగీర్, షాజహాన్‌ తదితర రాజులు పాలించారు. అప్పట్లో ఈ పట్టణం ఖాందేశ్‌కు రాజధానిగా వెలుగొందింది.

షాజహాన్‌ ఈ పట్టణంలో ఎక్కువ కాలం గడిపి షాహిఖిలాలో చేర్చేందుకు పాటుపడ్డారు. షాజహాన్‌ భార్య ముంతాజ్‌ ఈ ఖిలాలోనే తన పద్నాల్గవ బిడ్డను ప్రసవించి మరణించింది. ఈ పట్టణంలోనే ఆమె దేహాన్ని సమాధి చేశారు. మొదట బర్హన్‌పూర్‌లోనే ముంతాజ్‌ జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ నిర్మించాలనుకున్నారు. కానీ కారణాంతరాల వల్ల ఆగ్రాకు మార్చారు. మధ్య ప్రదేశ్‌లో పర్యటించాలనకుంటే.. ఈ చిన్నపట్టణం బుర్హన్‌పూర్‌ను మాత్రం తప్పక సందర్శించాలి.. అపురూప చారిత్రక కట్టడం జామామసీదును చూసి తీరాలి.

Next Story