బుమ్రా ఈజ్ ఫైన్..వేర్ ఈజ్ గ్రౌండ్..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 10:58 AM GMT
బుమ్రా ఈజ్ ఫైన్..వేర్ ఈజ్ గ్రౌండ్..?!

న్యూఢిల్లీ: వెన్ను గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌కు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కోలుకుంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం బుమ్రా గాయానికి శస్త్ర చికిత్స అవసరమని భావించినా అది అవసరం కాలేదు. ప్రస్తుతం తేలికపాటి ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్నాడు బుమ్రా. అదే సమయంలో రన్నింగ్‌ ప్రాక్టీస్‌ను కూడా తన దినచర్యలో భాగం చేశాడు. న్యూజిలాండ్‌తో డిసెంబర్‌లో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌ నాటికి బుమ్రా గాడిలో పడే అవకాశం కనబడుతోంది. టీమిండియా యాజమాన్యం కూడా కివీస్‌తో సిరీస్‌కు బుమ్రా సిద్ధమవుతాడనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తొందరల్లోనే భారత జట్టులోకి వస్తాననే ధీమాతో ఉన్నాడు బుమ్రా. దీనిలో భాగంగా జిమ్‌లో బుమ్రా ప్రాక్టీస్‌ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. టీమిండియా జట్టుతో త్వరలోనే జాయిన్‌ అవుతా అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ‘కమింగ్‌ సూన్‌’ అంటూ తన ఫోటోకు క్యాప్షన్‌ జత చేశాడు.

గాయం కారణంగానే వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరుగునున్న సిరీస్‌కు బుమ్రా దూరమయ్యాడు. గత కొన్ని రోజులుగా గాయం నుంచి కోలుకోవడంపైనే శ్రద్ధ పెట్టిన బుమ్రా బయట కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. దీపావళి వేడుకలు పురస్కరించుకుని ముంబై ఇండియన్స్‌ యజమాని నీతూ అంబానీ ఇచ్చిన విందుకు కూడా బుమ్రా దూరంగా ఉన్నాడు. ఇదిలా ఉంచితే, బుమ్రాకు ప్రతిష్టాత్మక విజ్డెన్‌ ఇండియా అల్మానక్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it