ఏకే-47 బుల్లెట్స్ ను తట్టుకోగలిగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల ధర ఎంతో తెలుసా..? 

By సుభాష్  Published on  13 March 2020 11:38 AM GMT
ఏకే-47 బుల్లెట్స్ ను తట్టుకోగలిగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల ధర ఎంతో తెలుసా..? 

టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్(టి.ఏ.ఎస్.ఎల్.) తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను భారత ఆర్మీ, పారా మిలటరీ సిబ్బంది వాడుతూ ఉంది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసు యంత్రాంగం కూడా వీటికి ఆర్డర్ ఇచ్చింది.

టి.ఏ.ఎస్.ఎల్. ఇప్పటికే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కౌంటర్ టెర్రరిజం వింగ్ అయిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్(ఆక్టోపస్) సంస్థకు సరఫరా చేశారు. యాంటీ-మావోయిస్టు విభామైన గ్రేహౌండ్స్ కు కూడా బెంగళూరుకు చెందిన ఈ సంస్థనే సరఫరా చేసింది. హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన 'వింగ్స్ ఇండియా 2020' ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లో ఈ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ లకు సంబంధించిన స్టాల్ ను ఏర్పాటు చేశారు.

తాము భారత ఆర్మీతో కలిసి పనిచేశామని.. వారు యుద్ధభూమిలో ఎదుర్కొనే అవాంతరాలకు సంబంధించిన ఎన్నో విషయాలపై పరిశోధనలు జరిపి ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందించామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఏకే-47 నుండి వచ్చే 7.62ఎం.ఎం. బుల్లెట్లను ఆపడమే కాకుండా, అంతకంటే శక్తివంతమైన బుల్లెట్లు కలిగిన సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ నుండి దూసుకొచ్చే 7.62ఎం.ఎం. బుల్లెట్లను ఆపగలడు.. అలాగే డ్రాగునోవ్ స్నైపర్ రైఫిల్ నుండి వచ్చే తూటాలను కూడా అడ్డుకోగలదు. అందుకే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అంత ఫేమస్ అయ్యాయి.. అలాగే భారీగా డిమాండ్ కూడా ఏర్పడింది. ఇప్పటిదాకా మూడు లక్షలకు పైగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఇండియన్ డిఫెన్స్ కు, పలు రాష్టాల పోలీసు డిపార్ట్మెంట్ లకు సరఫరా చేశారు.

ముందు నుండి ఆరు రౌండ్లు, వెనుకనుండి ఆరు రౌండ్లు కాల్పులు జరిపినా కూడా ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డుకోగలవు. పాలీ ఇథలీన్, బోరాన్ కార్బైడ్ లను ఉపయోగించి ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందించారు. ఈ కంపెనీ మరికొన్ని రకాల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందించింది. ఎటువంటి బుల్లెట్లను.. ఎటువంటి స్థితిలో ఎదుర్కొనగలవో దాన్ని బట్టి వివిధ రకాల బుల్లెట్ ప్రూఫ్ లను రూపొందించారు. ఏకే-47 నుండి దూసుకొచ్చే బుల్లెట్లను, హార్డ్ స్టీల్, మైల్డ్ స్టీల్ కోర్ బుల్లెట్లను, ఇన్సాస్ రైఫిల్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ నుండి వచ్చే తూటాల నుండి ప్రాణాలు కాపాడే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధర దాదాపు 40000 రూపాయలని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తెలంగాణ, గుజరాత్, ఛత్తీస్ ఘర్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు పోలీసులకు సరఫరా చేశామని వారు తెలిపారు. స్నైపర్ నుండి దూసుకువచ్చే బుల్లెట్ల నుండి సెక్యూరిటీ అధికారులను కాపాడడానికి ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కూడా సంస్థ రూపొందించింది. తలకు కూడా రక్షణ కలిగించేలా హెల్మెట్, కనులకు ప్రత్యేకంగా స్పెక్టకిల్స్ రూపొందించారు. ఈ హెల్మెట్ పిస్టల్ నుండి దూసుకు వచ్చే 9 ఎం.ఎం. బుల్లెట్లను, కార్బైన్, ఎంపీ-5 సబ్ మెషీన్ గన్ ల నుండి వచ్చే తూటాలను కూడా ఈ హెల్మెట్లు అడ్డుకోగలవట. కేవలం వీటిలో ఉపయోగించే లోహాల కోసం మాత్రమే కంపెనీ ఛార్జ్ చేస్తోందట. తమ కంపెనీ ఒక్కో నెలలో 10000 జాకెట్లను తయారు చేయగలదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Next Story