ఆ బాలుడు మృత్యుంజయుడు.. శిథిలాల కింద 18 గంటలు
By సుభాష్ Published on 26 Aug 2020 1:57 AM GMTమహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కూలిన ఆ భవనం శిథలాల కింద 18 గంటల పాటు ఉన్న ఆ బాలున్ని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి. రాయ్‌గఢ్ జిల్లా మహడ్ ప్రాంతంలో సోమవారం రాత్రి పది సంవత్సరాల నాటి భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వంద మంది వరకు శిథిలాల కింద చిక్కుకుపోగా, మృతుల సంఖ్య 13కు చేరింది. 60 మంది వరకు సహాయక బృందాలు ప్రాణాలతో కాపాడాయి. ముందుగా ఒకరు మృతి చెందగా, మంగళవారం మరో 12 మృతదేహాలను వెలికి తీశారు.
బాలుడు బతికినా.. తల్లి, సోదరీమణులు మృతి
భవనం శిథిలాల కింద 18 గంటల పాటు ఉన్న మహ్మద్ నదీమ్ (4) అనే బాలుడు సహాయక బృందాలు కాపాడాయి. కాంక్రీట్ స్లాబ్ కింద చిక్కుకున్న బాలున్ని గ్యాస్ కట్టర్ల సహాయంతో ఇనుప కడ్డీలను తొలగించి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి 18 గంటల పాటు శిథిలాల కింద ఉండి ప్రాణాలతో ఆ బాలుడు బయట పడటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరో దుదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఆ బాలుడి తల్లి నౌషిన్ నదీమ్ (30), సోదరీమణులు అయేషా (7), రుకియా (2) మృతి చెందడం అందరి హృదయాలను కలచివేసింది.