బ‌డ్జెట్ అంటే ఏమిటీ..? ఎందుకు ప్ర‌వేశ పెడుతారు..?

What is budget people need to know basics of union budget.కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్, సినిమా బడ్జెట్ ఇలా ఎన్నో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2023 3:00 PM IST
బ‌డ్జెట్ అంటే ఏమిటీ..?  ఎందుకు ప్ర‌వేశ పెడుతారు..?

కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్, సినిమా బడ్జెట్ ఇలా ఎన్నో విష‌యాల్లో బ‌డ్జెట్ అనే ప‌దాన్ని వాడుతుంటాం. అయితే.. అస‌లు బ‌డ్జెట్ అంటే ఏమిటీ..? ఈ ప‌దం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది అనే విష‌యాలు కొంత మందికి తెలిసినా చాలా మందికి తెలియ‌వు.

బడ్జెట్ అంటే ఏంటి?

బౌగెట్ అనే ఆంగ్ల ప‌ద‌మే వాడుక‌లో బ‌డ్జెట్‌గా మారింది. ఇక భార‌త రాజ్యాంగంలో బ‌డ్జెట్ అనే ప‌దాన్ని ఎక్క‌డా వాడ‌లేదు. రాజ్యాంగ ప్ర‌క‌ర‌ణ 112లో వార్షిక ఆర్థిక నివేదిక గా పేర్కొన్నారు. దీన్నే మ‌నం బ‌డ్జెట్‌గా పిలుస్తున్నాం.

భవిష్యత్తు లో జరిగే ఖర్చులు, ఉండే అవసరాలు కోసం ముందుగానే మన దగ్గర ఉన్న డబ్బుల కేటాయింపు లేదా పంపకాన్ని బడ్జెట్ అంటారు. ఇంకా స్థూలంగా బ‌డ్జెట్ అంటే ఒక నిర్థిత కాలానికి రాబోయే ఆదాయం, చేయ‌బోయే వ్య‌యం గురించి వివ‌రించే కోశ నివేదిక‌.

బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు?

1999 వ‌ర‌కు మ‌న దేశంలో బ‌డ్జెట్‌ను ఫిబ్ర‌వ‌రి చివ‌రి ప‌ని దినాన సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌క‌టించేవారు. ఆర్థిక శాఖ మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా బ్రిటీష్ కాలం నుంచి వ‌స్తున్న ఈ సంప్ర‌దాయాన్ని మార్చి ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌వేశ పెట్ట‌డం మొద‌లుపెట్టారు. అయితే.. 2017 నుంచి కేంద్ర బ‌డ్జెట్‌ను ఫిబ్ర‌వ‌రి 1న ప్ర‌వేశ‌పెడుతున్నారు.

మొద‌టి బ‌డ్జెట్ :

భార‌త‌దేశానికి స్వాతంత్రం రావ‌డానికి పూర్వ‌మే బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. 1860 ఏప్రిల్ 7న తొలి సారి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టారు. ఈస్ట్ఇండియా స్కాటిష్ ఆర్థిక‌వేత్త జేమ్స్ విల్స‌న్ బ‌డ్జెట్‌ను బ్రిటిష్ రాణికి స‌మ‌ర్పించారు. స్వ‌తంత్రం అనంత‌రం భార‌త మొద‌టి బ‌డ్జెట్‌ను న‌వంబ‌ర్ 26, 1947న అప్ప‌టి ఆర్థిక మంత్రి ఆర్‌కే ష‌ణ్ముఖం శెట్టి ప్ర‌వేశ‌పెట్టారు.

బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడతారు?

కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్ర‌వేశ‌పెడుతారు. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌డ్జెట్‌ను అత్య‌ధికంగా మాజీ ప్ర‌ధాని మొరార్జీ దేశాయ్ ప్ర‌వేశ‌పెట్టారు. ఆర్థిక మంత్రిగా ప‌ని చేసిన‌ప్పుడు ఆయ‌న 10 సార్లు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఆ త‌రువాత పి.చిదంబ‌రం 9 సార్లు, ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ 8 సార్లు, య‌శ్వంత్ సిన్హా 8 సార్లు, మ‌న్మోహ‌న్ సింగ్ 6 సార్లు బ‌డ్జెను ప్ర‌వేశ పెట్టారు. ప్ర‌స్తుత ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు ప్ర‌వేశ‌పెట్ట‌గా.. 2023-24లో ఐదో సారి కానుంది.

బడ్జెట్ ఎందుకు?

బడ్జెట్ వల్ల ప్రభుత్వం వద్ద ఉన్న నిధుల నిర్వహణ సులభతరం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా కొనసాగుతాయి. బడ్జెట్ వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో శాఖలకు నిధుల కేటాయింపులతో పాటు లక్ష్యాలను నిర్దేశించుకునే అవకాశం ఉంది. ఓసారి బడ్జెట్‌లో అంచనాలు తప్పితే వచ్చే ఏడాది ఈ తప్పిదం జరగకుండా జాగ్రత్త పడవచ్చు. మెరుగ్గా ఆర్థిక అంశాలను చక్కదిద్దుకోవచ్చు. ఇంకా వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును కూడా పర్యవేక్షించొచ్చు.

మొత్తంగా దేశంలో ఉన్న ప్ర‌జ‌ల ఆర్థిక వ్య‌వ‌హ‌రాలు స‌జావుగా సాగాలంటే బ‌డ్జెట్ ఖ‌చ్చితంగా అవ‌స‌రం. ఇక్క‌డ ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. బ‌డ్జెట్‌కు పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు ఆమోదం తెల‌పాల్సి ఉంటుంది.

Next Story