2023 కేంద్ర బడ్జెట్‌పై.. భారీ ఆశలు పెట్టుకున్న విద్యారంగం
The education sector has high hopes for the 2023 central government budget. ఫిబ్రవరి 1, 2023న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023ని
By అంజి Published on 27 Jan 2023 12:47 PM ISTఫిబ్రవరి 1, 2023న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. 2024 సంవత్సరంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుతన్న చివరి బడ్జెట్ ఇదే. దీంతో అనేక రంగాలకు చెందిన వారు ఈ బడ్జెట్‌పై బోలేడన్నీ ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థికమాంద్యం, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిస్థితుల మధ్య కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.
ఈ బడ్జెట్‌పై విద్యారంగం భారీ అంచనాలను పెట్టుకుంది. భారతదేశ విద్యా రంగం.. కోవిడ్ మహమ్మారి అనంతర ఉన్నత స్థాయికి చేరుకుంది. భవిష్యత్ సన్నద్ధత దిశగా ముందుకు సాగే బడ్జెట్ విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. భారతీయ విద్యా వ్యవస్థను అన్ని స్థాయిల్లో అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్యా రంగానికి బడ్జెట్ ప్రోత్సాహం చాలా అవసరం కూడా. ప్రధానంగా ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర బడ్జెట్ 2023-24పై ఉంది.
గత అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా నిధులు లేని విద్యా రంగానికి, ప్రోత్సాహకరమైన నిధులను ఇచ్చి నూతన మార్పులకు సిద్ధం చేస్తుందని భావిస్తున్నారు. 2022-23లో విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపు మొత్తం నిధులలో 2.6 శాతం మాత్రమే. ఉన్నత విద్య కోసం రూ. 40828.35 కోట్లు కేటాయించగా, పాఠశాల విద్యకు రూ. 63449.37 నిధులు మంజూరు చేయబడ్డాయి. ఈ గణనీయమైన నిధుల కొరత మధ్య భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి (GDP)లో కనీసం 3-3.5 శాతం విద్యపై ఈ సంవత్సరం ఖర్చు చేస్తుందని అంచనా వేయబడింది.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) కింద ప్రభుత్వం ఇటీవల కొత్త కార్యక్రమాలు, విధాన మార్పులను ప్రవేశపెట్టడంతో ఈ ఏడాది బడ్జెట్ పై విద్యారంగం భారీ ఆశలు పెట్టుకుంది. కాగా ఉన్నత విద్యావ్యవస్థలో 34 మిలియన్ల అదనపు విద్యార్థులను చేరుకోవడం ద్వారా 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (GER)ని 50 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ వృద్ధికి ఆజ్యం పోసే సంస్థలు ప్రాథమికంగా ప్రైవేట్ సంస్థలు అయినప్పటికీ, వారికి లభించే మద్దతు చాలా తక్కువ. గత ఏడాది మాత్రమే 11 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు.
2047 సంవత్సరం నాటికి ప్రపంచ శ్రామిక శక్తిలో 25 శాతం మంది భారతీయులే ఉండాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి, ప్రభుత్వం ప్రారంభ దశలోనే పెట్టుబడులు పెట్టాలని ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ మ్యానేజింగ్ డైరెక్టర్ లెజో సామ్ ఊమెన్ సూచించారు. గ్రామాల్లోని సర్కార్ బడుల్లో క్లాస్‌రూమ్‌లను డిజిటలైజ్ చేయడం, ప్రతి బడిలో ఏఆర్/వీఆర్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడంపై కేటాయింపులను పెంచాలని వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ వ్యవస్థాపకుడు మానవ్ సుబోధ్ సిఫార్సు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి హామీలపై దృష్టి సారించేందుకు స్టార్టప్‌లకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండాలని ఇమార్టికస్ లెర్నింగ్ సీఈవో నిఖిల్ బర్షికర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రానున్న కేంద్ర బడ్జెట్ ప్రకటనలపై విద్యా రంగం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.