Budget 2024: బడ్జెట్ ముందు హల్వా వేడుక.. ఎందుకో తెలుసా?
బడ్జెట్ అనేది వార్షిక ఆర్థిక పత్రం. అయితే ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
By అంజి Published on 23 Jan 2024 8:00 AM GMTBudget 2024: బడ్జెట్ ముందు హల్వా వేడుక.. ఎందుకో తెలుసా?
బడ్జెట్ అనేది వార్షిక ఆర్థిక పత్రం. అయితే ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2019లో ఆర్థిక మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది తన తొలి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది బడ్జెట్ ముందు హల్వా వేడుక జరుగుతుంది. అయితే ఈ వేడుక ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కారణాలేంటీ అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హల్వా వేడుక
హల్వా వేడుక దశాబ్దాలుగా బడ్జెట్‌తో ముడిపడి ఉన్న సంప్రదాయం. బడ్జెట్ ముద్రణకు ముందు హల్వా వేడుక జరుగుతుంది. మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఏ శుభ కార్యమైనా స్వీట్‌తో ప్రారంభించడం ఆనవాయితీ, కాబట్టి బడ్జెట్ ప్రక్రియను శుభప్రదంగా భావించి ముందు హల్వా తయారు చేస్తారు. ఓ పెద్ద కడాయిలో హల్వాను చేసి.. బడ్జెట్ టీమ్ అందరికీ ఆర్థిక మంత్రి స్వయంగా అందిస్తారు.
పటిష్ఠ భద్రత
ఆ తర్వాత నుంచి ఆర్థిక శాఖలో పటిష్ఠమైన భద్రత ఉంటుంది. బడ్జెట్‌లో గోప్యత పాటించడమే ఇందుకు కారణం. బడ్జెట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లీక్ కాకుండా నిరోధించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, న్యాయ మంత్రిత్వ శాఖ, సీబీడీటీ, సీబీఐసీ, పీఐబీ అధికారులు నార్త్ బ్లాక్‌లో సుమారు 10 రోజుల పాటు నిర్బంధంలో ఉండిపోతారు. ఈ సమయంలో సిబ్బంది ఎవరూ కూడా వాళ్ల ఇంటికి వెళ్లడం కానీ, కుటుంబ సభ్యులతో మాట్లాడటం కానీ చేయకూడదు. సిబ్బంది తన కుటుంబంతో లేదా ఇంకా ఎవరితో అయినా అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తే.. ఫోన్ కాల్ ద్వారా మాట్లాడతారు. ఆ ఫోన్ కాల్స్ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘాలో ఉంటాయి. అధికారులు అందరూ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత మాత్రమే బయటకు వస్తారు. బడ్జెట్ ప్రింట్ చేయడానికి ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉంది. 1950లో బడ్జెట్ వివరాలు లీక్ అయిన నాటి నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.