కేంద్ర బడ్జెట్‌ - 2023: నిర్మలమ్మ పద్దు పూర్తి వివరాలు మీ కోసం

Here are the important and complete contents of Union Government Budget-2023. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం

By అంజి  Published on  1 Feb 2023 7:45 AM GMT
కేంద్ర బడ్జెట్‌ - 2023:  నిర్మలమ్మ పద్దు పూర్తి వివరాలు మీ కోసం

2023 - 24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై ఆమె ప్రసంగించారు. కరోనా సమయంలో పీఎం గరీభ్‌ కల్యాణ్‌ అన్నయోజన స్కీమ్‌ కింద 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ పంపిణీ చేశామని, ఇది ఈ ఏడాది కూడా కొనసాగుతుందన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా 11.7 కోట్లతో టాయ్‌లెట్స్‌ నిర్మాణం చేపట్టామన్నారు. 220 కోట్ల కోవిడ్‌ టీకాలను అందించామన్నారు. 44 కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకం అందుతోందని, విశ్వకర్మ కౌశల్‌ స్కీమ్‌లో భాగంగా చేనేత కార్మికులకు చేయూత అందిస్తున్నామని చెప్పారు. ఉచిత ఆహార ధాన్యాల స్కీమ్‌కు రూ.2 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం భరిస్తోందన్నారు.

పీఎం మత్స్య సంపద యోజన కోసం అదనంగా రూ.6 వేలు కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.20 లక్షల కోట్ల వరకూ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతులు తమ ఉత్పత్తుల నిల్వ కోసం మరిన్ని గిడ్డంగులు, పంచాయతీ స్థాయిలో నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తమన్నారు. దేశంలో మెడికల్‌ కాలేజీలతో పాటు, 157 నర్సింగ్‌ కాలేజ్‌లకు అనుమతి ఇస్తున్నామని, త్వరలోనే ఐసీఎంఆర్‌ ల్యాబ్‌ల విస్తృతిని మరింత పెంచుతామన్నారు. ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. మెడికల్‌ కాలేజీల్లో మరిన్ని ఆధునాతన ఫెసిలిటీలు కల్పిస్తామన్నారు. లెక్చరర్ల ట్రైనింగ్‌కు డిజిటల్‌ విద్యావిధానం, జాతీయ డిజిటల్‌ లైబ్రరీ తీసుకొస్తామన్నారు.

అలాగే ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు చేరువ చేసేందుకు మరిన్ని చర్యలు చేపట్టామన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని, ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కోసం రూ.15 వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఏకలవ్య స్కూళ్లలో భారీగా టీచర్ల నియామకాలు, డిజిటల్‌ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. జైళ్లలో మగ్గిపోతున్న పేద ఖైదీలకు ఆర్థిక చేయూతను అందిస్తామన్నారు.

భారతీయ రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు

ఈ బడ్జెట్‌లో రైల్వేలకు రికార్డు స్థయిలో నిధుల కేటాయింపు చేస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రైల్వేల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ.2.40 లక్షల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట వేశామని, అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. అలాగే మూలధనం కింద 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయింస్తున్నామన్నారు.

కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి, కొనుగోలు చేసేవారికి నిర్మలమ్మ శుభవార్త చెప్పారు. పీఎం ఆవాస్‌ యోజన స్కీమ్‌కు ఈ సారి బడ్జెట్‌లో నిధులు పెంచారు. ఈ ఏడాది ఈ స్కీమ్‌కు రూ.79 వేల కోట్లు కేటాయించారు. బ్యాంకు వడ్డీ రేట్లు పెరిగిన వేళ.. ఈ రకంగా ఇల్లు కొనుగోలు దారులకు కేంద్రం ఊరట కలిగించింది. అలాగే జాతీయ సహకార డేటా బేస్‌కు రూ.2,516 కోట్లు కేటాయించారు. ఫిన్‌టెక్‌ సర్వీసుల కోసం డిజిలాకర్‌ కేవైసీ మరింత సరళీకరణ చేయనున్నారు. ప్రయోగశాల్లో వజ్రాల తయారీకి ఐఐటీలకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు. 5జీ అప్లికేషన్ల తయారీకి 100 ల్యాబ్‌లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఏ వర్క్‌ మిషన్‌తో పాటు స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వనున్నారు.

దీంతో పాటు ఈ బడ్జెట్‌లో ఈ - కోర్టులకు రూ.7 వేల కోట్లు కేటాయించారు. పట్టణ మౌలిక సౌకర్యాలకు రూ.10 వేల కోట్ల నిధులు ఇవ్వనున్నారు. 2030 కల్లా 5 ఎంఎంటీ హైడ్రోజన్‌ తయారీ, లడఖ్‌లో పునరుత్పాదక ఎనర్జీ కోసం రూ.20,700 కోట్లు, నేషనల్‌ హైడ్రోజన్‌ కార్యక్రమానికి రూ.19,700 కోట్లు కేటాయించారు. సముద్ర తీర ప్రాంతాల్లో మడ అడవుల పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ తన బడ్జెట్‌లో రాష్ట్రాలకు వడ్డీలేనీ రుణాల పథకం మరో ఏడాది పొడిగించింది. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయించింది. కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు, బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.13.5 లక్షల కోట్లు కేటాయించింది. కోస్టల్‌ షిప్పింగ్‌కు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పొల్యూషన్‌ కారక వెహికల్స్‌ తొలగింపులో భాగంగా వెహికల్‌ తుక్కు విధానం, పీఎం కౌశల్‌ యోజనలో భాగంగా యువతకు శిక్షణ, ప్రకృతి వ్యవసాయం చేసేందుకు వీలుగా కోటి మంది రైతులకు సాయం, 36 అంతర్జాతీయ స్థాయి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు.

కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు, అక్కడ సాగు రంగానికి రూ.5,300 కోట్లు కేటాయించారు. దేశ వ్యాపత్ంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. 5 జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటు, పీఎం కౌశల్‌ స్కీమ్‌ కింద 4 లక్షల మందికి శిక్షణ, దేశంలో 50 టూరిస్ట్‌ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త స్కీమ్‌ తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయొచ్చు. డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది.

సీనియర్‌ సిటిజన్స్‌లో పొదుపు స్కీమ్‌లో భాగంగా డిపాజిట్‌ పరిమితి పెంచుతున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా ఆర్థికమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం రూ.15 లక్షల వరకు పరిమితి ఉండగా, దానిని రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. గంట 26 నిమిషాల పాటు కొనసాగిన బడ్జెట్ ప్రసంగంలో వేతన జీవులకు ఊరట కనిపించింది. పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు ఆర్ధిక శాఖా మంత్రి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటన చేసారు. సంవత్సర ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 శాతం పన్ను విధించనున్నారు. ఇది కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకూ 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ 20 శాతం పన్ను, రూ.15 లక్షలు పైబడిన వారికి 30 శాతం పన్ను వర్తిస్తుంది.

బంగారం, వెండి ధరలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు. దీంతో బంగారం, వెండి ధరల పెరగనున్నాయి. టైర్లు, సిగరెట్ల ధరలు పెరిగే ఛాన్స్‌ ఉంది. ఎలక్ట్రిక్‌ వాహన ధరలతో పాటు, చిమ్నీలు, టీవీ, మొబైల్‌ల ధరలు తగ్గనున్నాయి. బ్రాండెడ్ దుస్తుల ధరలు, విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెరగనుంది.

Next Story