బీజేపీ కీల‌క నిర్ణ‌యం.. బడ్జెట్‌పై 12 రోజులు దేశ వ్యాప్తంగా ప్ర‌చారం..!

BJP plans nationwide campaign on Union Budget.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2023 5:09 AM GMT
బీజేపీ కీల‌క నిర్ణ‌యం.. బడ్జెట్‌పై 12 రోజులు దేశ వ్యాప్తంగా ప్ర‌చారం..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టే పూర్తి స్థాయి చివ‌రి బ‌డ్జెట్ ఇది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించబోయే “ప్రజల అనుకూల” చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) 12 రోజుల దేశవ్యాప్త ప్రచారాన్ని నేటి(బుధ‌వారం) నుంచి ప్రారంభించ‌నుంది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ నాయ‌కులు తెలియ‌జేశారు. సీనియర్ నేత సుశీల్ మోదీ సమన్వయంతో ప్రచారం నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్ర‌చారం ఫిబ్ర‌వ‌రి 12న ముగియ‌నుంది.

దేశంలోని అన్ని జిల్లాల్లో కేంద్ర బడ్జెట్‌పై చర్చలు, విలేకరుల సమావేశాలు లేదా సెమినార్‌లు నిర్వహించేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రైతు, యువజన విభాగాల అధినేతలతో సహా తొమ్మిది మంది సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆ పార్టీ నాయ‌కులు తెలిపారు. పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఒక రోజు తర్వాత, ప్రచారంలో భాగంగా అన్ని బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తారని, పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో బిజెపి యూనిట్ అధిపతులు మరియు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తారన్నారు.

దేశంలోని 50 ప్రధాన నగరాల్లో, కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన “ప్రజల అనుకూల” చర్యలను హైలైట్ చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వ మంత్రులు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తార‌న్నారు.

ఇక‌.. బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత బీజేపీ అధికార ప్రతినిధుల సమావేశం కూడా నిర్వహించాలని భావిస్తున్నారు.

2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, ఈ కేంద్ర బడ్జెట్ నరేంద్ర మోడీ ప్రభుత్వ రెండవ టర్మ్ యొక్క చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అవుతుంది. అందుకే.. కేంద్రంలోని అధికార బిజెపి ఈ ప్రచారాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది.

Next Story