సోషల్ మీడియాలో కావాలనే వీడియోల పోస్టింగ్.. వారిపై దృష్టి పెట్టిన పోలీసులు

By రాణి  Published on  29 Feb 2020 7:25 AM GMT
సోషల్ మీడియాలో కావాలనే వీడియోల పోస్టింగ్.. వారిపై దృష్టి పెట్టిన పోలీసులు

నార్త్-ఈస్ట్ ఢిల్లీలో చోటుచేసుకుంటున్న ఘటనల పట్ల దేశం మొత్తం బాధపడుతోంది. ఢిల్లీ పోలీసులు కూడా హై-అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియా పేజీల పైనా, వాట్సప్ లో సర్క్యులేటింగ్ అవుతున్న మెసేజీలపైనా ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు. కావాలనే కొన్ని ఫోటోలను వైరల్ చేస్తున్న కొన్ని ఐసిస్ సానుభూతిపరుల ఛానల్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఓ వ్యక్తిని కొంతమంది కలిసి కొడుతున్న వీడియోలను కావాలనే పలు గ్రూప్ లలో పోస్టు చేయడం.. వైరల్ చేయడం రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం 'స్పెషల్ సెల్' దృష్టిలో పడింది. గురువారం నుండి అదే పనిగా ఈ వీడియోలను పోస్టు చేశారు.

భారత్ మీద దాడి చేయాలంటూ ఆ వీడియోల కింద రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐసిస్ అనుబంధంగా పని చేసే గ్రూపులే కాకుండా లష్కర్-ఏ-తాయిబా, జైష్-ఏ-మొహమ్మెద్ సానుభూతి పరులుగా పని చేసే కొన్ని ఛానల్స్, పేజీలు ఈ వీడియోలను వరుసగా పోస్టులు చేశాయి. 'ముస్లింల మీద హిందువుల దాడులు' 'భారత్ మంటల్లో కలిసిపోవాల్సిన సమయం వచ్చింది.. త్వరలో బూడిద కాబోతోంది' అంటూ పోస్టులు పెట్టారు. వీటిని సోషల్ మీడియాలో ఉంచకుండా చేయడానికి స్పెషల్ సెల్ ప్రయత్నిస్తోంది. కావాలనే రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా ఈ టెర్రర్ గ్రూపులకు ఆకర్షితులైన యువకులపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఢిల్లీ పోలీసులు. ఎవరైతే అటు వైపు నుండి సూచనలు విని ఈ దాడులకు పాల్పడ్డారో వారిని కూడా పోలీసులు విచారించనున్నారు. గతంలో టెర్రరిస్టు యాక్టివిటీస్ లో అరెస్టు అయి.. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన వారు కూడా ఈ అల్లర్లలో ముఖ్య భాగమయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని తీవ్రవాద సంస్థల నుండి ఆదేశాలు అందాక ఈ దాడులకు పాల్పడినట్లు గుర్తించారు. వారిని ఇప్పటికే అదుపు లోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.

జవాన్ ఇంటిని కూడా తగులబెట్టారు

ఇక ఢిల్లీ లోని కాస్ ఖజూరి వీధి..! బీఎస్ఎఫ్ జవాన్ మహ్మద్ అనీస్ కుటుంబం కూడా నివసిస్తోంది. అక్కడ ఎక్కువగా హిందూ కుటుంబాలే.. చాలా ఏళ్లుగా హాయిగా బ్రతుకుతున్నారు. 2020, ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం నాడు అతని ఇంటికి సమీపంలో కార్లకు నిప్పుపెట్టారు. ఆ వెంటనే అనీస్ నివాసంపై రాళ్ల వర్షం కురిపించారు. ఇంట్లో ఉన్న వారు తీవ్ర భయాందోనళలకు గురయ్యారు. ఓ గ్యాస్ సిలిండర్‌ను ఇంట్లోకి వదిలి నిప్పు పెట్టారు. ఇంట్లో అనీస్ తండ్రి మహ్మద్ మునీస్, అంకుల్ మహ్మద్ అమ్మద్, నేహా పర్వీన్ (18) ఉన్నారు. కొద్దిసేపు ఏమి జరుగుతోందన్నది వారికి అర్థం అవ్వలేదు.. కానీ అక్కడే ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదం అని భావించారు. ఆ తర్వాత పారామిలటరీ బలగాల సహాయంతో అక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డారు. అనీస్ నివాసంతో పాటు 35 ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. నేహా పర్వీణ్ వివాహం ఏప్రిల్‌లో, ఆనీ వివాహం కూడా జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా పెళ్లికి అవసరమైన సామాగ్రి, వస్తువులు కొని పెట్టుకున్నారు. అవి కూడా కాలిపోయాయి. స్థానికంగా ఉన్న హిందూ కుటుంబాలకు సంబంధించి ఘర్షణల్లో ఎవరూ పాల్గొనలేదని, బయటి నుంచి వచ్చిన వ్యక్తులు ఈ ఘటనలకు పాల్పడ్డారని అనీస్ కుటుంబం చెబుతోంది. 2013లో బీఎస్ఎఫ్‌లో చేరాడు అనీస్.. ప్రస్తుతం ఒడిశాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

Next Story