ఢిల్లీలో అల్లకల్లోలం.. పోలీసుల తీవ్ర వైఫల్యం..

By అంజి  Published on  27 Feb 2020 3:38 AM GMT
ఢిల్లీలో అల్లకల్లోలం.. పోలీసుల తీవ్ర వైఫల్యం..

ముఖ్యాంశాలు

  • ఉద్రిక్తంగానే ఢిల్లీ
  • 27కు చేరిన మృతులు సంఖ్య
  • పోలీసులు, భద్రతాసిబ్బంది కవాతు

ఢిల్లీ: దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలతో అట్టుడుకుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగింది. ఢిల్లీలో అదుపు తప్పుతున్న పరిస్థితులను, హింసాత్మక ఘటనలను గాడిన పెట్టేందుకు జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌కు బాధ్యతలను అప్పగించింది. బుధవారం నాడు చెదురు ముదురు ఘటనలు మినహా కొంత పరిస్థితి అదుపులోకి వచ్చిందనే చెప్పుకోవాలని. కాగా ఇప్పటి వరకు ఢిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య 27కు చేరింది. దాదాపు 250 మందికిపైగా గాయాలు అయ్యాయి. ఈ ఘర్షణల్లో ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారి ఒకరు మురుగు కాలువలో శవమై తేలారు. మరోవైపు ఎవరు ఎటున్నుంచి వచ్చి కాల్పులు జరుపుతారో అన్న భయంతో ఢిల్లీ ప్రజలు బిక్కు బిక్కుమంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈశాన్య ఢిల్లీలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. కొందరు ప్రజలు వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు.

కాగా అల్లర్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విధి నిర్వహణకూ అనుమతి కావాలా అంటూ చీవాట్లు పెట్టింది. అల్లర్ల అదుపులో పోలీసులు వైఫల్యాన్ని ప్రశ్నించింది. పౌరసత్వం సవరణ చట్టం సంబంధిత అల్లర్లపై పిటిషన్లను విచారించేందుకు జస్టిస్‌ కె.ఎం జోసెఫ్‌ల, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ ధర్మాసనం నిరాకరించింది.

అటూ రాజకీయంగా కూడా ఈ అల్లర్లు వేడిని పుట్టించాయి. కేంద్రహోంమంత్రి అమిత్‌షా వెంటనే రాజీనామా చేయాలని అంటూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. ఢిల్లీ పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా ఆరోపించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన విద్వేషపూరిత ప్రసంగాలే ఈ ఘటనలకు దారితీశాయన్నారు.

రాజధాని ఢిల్లీ హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రజలు సోదరభావంతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజలు కృషి చేయాలన్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు విస్తృతస్థాయి సమీక్షలు జరిపామన్న ఆయన.. త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.

ఇందిరా గాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్ల నాటి పరిస్థితిని పునరావృతం కానివ్వమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఢిల్లీ అల్లర్లపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

అల్లర్లలో అమానవీయ కోణం..

ఓల్డ్‌ బ్రిజ్‌పురీకి చెందిన సర్ఫరాజ్‌ అనే వ్యక్తి తన తండ్రితో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ అల్లరి మూక వారి చుట్టుముట్టింది. పేరు చెప్పాలని ఆ మూక అడిగింది. బాధితుడు తన పేరు మార్చి చెప్పినా వారికి నమ్మకం కలగలేదు. దీంతో బట్టలు విప్పాలన్నారు. అతడు బట్టలు విప్పలేక తన పేరును చెప్పాడు. ఇలా మత ఛాందసులు ఢిల్లీలో రెచ్చిపోతున్నారు. తన భార్యకు, ఇంటికి తాను ఒక్కడినే ఆధారమని ఎంత వేడుకున్నా ఆ మూక వినలేదు. ఆ బాధితుడిని మంటల్లో వేశారు. ప్రస్తుతం సర్ఫరాజ్‌ మృత్యువుతో పోరాడుతున్నాడు. దేశ రాజధానిలో ఇలాంటి దారుణ ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి.

Next Story