31దాటితే.. అవి మూలకే!

By సుభాష్  Published on  6 March 2020 9:41 AM GMT
31దాటితే.. అవి మూలకే!

మీ దగ్గర బీఎస్‌-4 మోడల్‌ వాహనం ఉందా.. దానికి రిజిస్ట్రేషన్‌ కాలేదా..? అయితే మీరు త్వర పడాల్సిందే.. లేకుంటే దానిని తక్కు సామాన్లు వేసుకోవాల్సి వస్తుంది. ఈనెల 31వరకు ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోతే వాటికి ఎప్పటికీ రిజిస్ట్రేషన్లు కావు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 31 తరువాత వాటిని రిజిస్ట్రేషన్‌ చేయరు. దీనికితోడు క్రయ విక్రయాలు ఉండదు. ఇక బీఎస్‌ -4 మోడల్‌ వాహన తయారీలే ఉండవు.

ద్విచక్ర వాహనాలు, కార్లలో నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు, కాలుష్య నియంత్రణ నిబంధనల్లో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం భారత్‌ స్టేజ్‌ ఎమిషన్‌ స్టాండర్డ్స్ (బీఎస్‌ఈఎస్‌) పేరిట నియామావళిని రూపొందించింది. దీంతో ఏప్రిల్‌ 1నుంచి ప్రతి వాహన తయారీదారు బీఎస్‌ -4 మోడల్‌ వాహనాలను విక్రయాలు చేయటం నిషేధం. వీటి రిజిస్ట్రేషన్లు సైతం ఉండవు. రెండు, నాలుగు చక్రాల వాహనాలను బీఎస్‌ -6 ప్రమాణాల మేరకు ఉత్పత్తి చేసి విక్రయించాల్సి ఉంది. రాష్ట్రంలో 2014 నుంచి విక్రయమైన వాటిలో 2,59,678 బీఎస్‌-4 వాహనాలు రిజిస్ట్రేసన్‌ కాలేదు. వీటిలో మోటారు సైకిళ్లు 2,22,229 ఉండగా, ట్రాక్టర్లు 24,709, కార్లు, క్యాబ్‌లు 7,467, సరకు రవాణా వాహనాలు 2,796, ఆటోలు, ఈ రిక్షాలు 1,729, ఇతరాలు 748 వాహనాలు ఉన్నాయి. వీటికి మార్చి 31వరకు మాత్రమే రిజిస్ట్రేషన్‌కు గడువు విధించారు.

ఆ తరువాత వాటిని తక్కు సామాన్లుకు వేసుకోవాల్సిందే. బీఎస్‌-4 వాహనాల వల్ల వాహన కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కాలుష్య నియంత్రణే లక్ష్యంగా సుప్రీంకోర్టు వీటి తయారీని, రిజిస్ట్రేషన్‌లను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మార్చి 31వరకు మాత్రమే బీఎస్‌-4 వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.

బీఎస్‌ -4 మోడల్‌, బీఎస్‌ -6 మోడల్‌కు తేడా ఇదే..

సుప్రింకోర్టు ఏప్రిల్‌ ఒకటి నుంచి బీఎస్‌ -6 వాహనాలను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలని, ఇప్పటికే రవాణా శాఖకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వేగం, సామర్థ్యం పరంగా బీఎస్‌ -6 మోడల్‌ వాహనాలు మెరుగ్గా ఉండి, కాలుష్యాన్ని తగ్గిస్తాయి. తయారీదారులు సరికొత్త ఫీచర్లు, భద్రత ప్రమాణాలతో ఈ వాహనాలను మార్కెట్‌లోకి తెస్తున్నారు. వీటిలో మైలేజీ పరంగా 15శాతం అధికంగా ఉన్నా, ట్యాంకులో కనీసం 2నుంచి 3 లీటర్ల పెట్రోలు నిరంతరం నిల్వ ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాహనం నడవదని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. బీఎస్‌ -4 వాహనాలైతే కనీస పరిమాణంలో ఇంధనం ఉన్నప్పటికీ వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. దీంతో కాలుష్యం ఎక్కువ గా వస్తుంది. బీఎస్‌ -6 వాహనాల్లో ఆ పరిస్థితి ఉండదు.

రిజిస్ట్రేషన్‌ లేకుండా నడుపుతామంటే కుదరదు..

లక్షల సంఖ్యలో వాహనాలు రిజిస్ట్రేషన్‌ కాకున్నా ఇన్నాళ్లూ పట్టించుకోకపోవటం గమనార్హం. ప్రస్తుతం జీవిత కాల పన్ను వసూలు చేసి, తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి డీలర్లు వాహనాలనుకొనుగోలు దారులకు అప్పగిస్తున్నారు. కానీ ఇప్పుడు అలా కుదరదంటున్నారు అధికారులు. తాత్కాలిక రిజస్ట్రేషన్‌ 30రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్‌ లేకుండా వాహనం నడపటం నేరం. రిజిస్ట్రేషన్‌ లేకుండా పట్టుబడితే రూ. వెయ్యి అపరాధ రుసుము విధిస్తారు. వాహనాన్ని బీమా చేసేందుకు కంపెనీలు అనుమతించవు. ప్రమాదాలు జరిగినప్పుడు బీమా పొందే అవకాశం ఉండదు. బీమా పత్రాలు లేకుండా వాహనంనడిపితే రూ. వెయ్యి అపరాధ రుసుమువేస్తారు. మూడోపార్టీ బీమా పత్రాలు లేకపోతే వెయ్యి నుంచి పదివేలు వరకు అపరాధ రుసుము విధిస్తారు. నూతన నిబంధనల ప్రకారం బీమా లేని వాహనం నడిపితే రూ. 2వేల అపరాధ రుసుము. మూడు నెలలు జైలుశిక్ష. బీమా లేకుండా రెండో దఫా పట్టుపడితే రూ. 4వేల అపరాధ రుసుము, మూడు నెలల జైలు శిక్ష తప్పనిసరి.

Next Story