ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌ వినపడనుంది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 వాహనాలను వాహన తయారీ కంపెనీలు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాహన ఖరీదును బట్టి ప్రస్తుతం ఉన్న వాహనాల ధర రూ.5వేల నుంచి 15 వేల వరకు పెరగనుంది. అయితే కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు  బీఎస్‌-6 వాహనాలను వాడకం తప్పనిసరి. కానీ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వడం లేదు.

అయితే ఈ విషయం అలా ఉంచితే, ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారుల జేబులకు చిల్లులు పడనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని దాదాపు అన్ని చమురు కంపెనీలు బీఎస్‌ 6 ప్రమాణాలు ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ను విక్రయించనున్నారు. ప్రస్తుతం బీఎస్‌-4 ప్రమాణాల ఇంధనం దేశమంత సరఫరా అవుతోంది. దీని వల్ల కాలుష్యం ఎక్కువ పెరిగిపోతోంది. అందుకే 2020 ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 ఇంధనం వాడాలని కేంద్ర సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. బీఎస్‌-4 తర్వాత బీఎస్‌-5 ఉన్నా.. కేంద్రం మాత్రం నేరుగా బీఎస్‌-6 ఇంధనానికి మారాలని నిర్ణయించింది. ఇక బీఎస్‌-4 ఇంధనంతో పోలిస్టే బీఎస్‌-6 ఇంధనంతో కాలుష్యం చాలా తగ్గుతుంది. ఈ ఇంధనం సరఫరా చేయడం వల్ల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ధరలు ఎంత పెరుగుతాయనే విషయం ఇండియన్‌ ఆయిల్‌ సంస్థలు మాత్రం వెల్లడించలేదు.

కాగా, బీఎస్‌-6 ప్యూయెల్‌ కోసం మిషనరీలను అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఆయిల్‌ కంపెనీలన్నీ రూ.35వేల కోట్ల వరకు ఖర్చు పెడితే, తాము మాత్రం రూ. 17 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల స్వల్పంగానే ఉంటుందని, భారీగా ఏమి ఉండదని ఆయన అభిప్రాయపడుతున్నారు. మార్చి 1 నుంచే బీఎస్‌-6 ఇంధనం సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.