పెళ్లి తరువాత జీవితం పై ఆ అమ్మాయి ఎన్నో కలలు కనింది. భర్తతో కలిసి నూరేళ్లు జీవించాలని ఆశపడింది. పెళ్లైన మరుసటి రోజు నుంచే అత్తమామలు వేధింపులు ఎక్కవయ్యాయి. దీంతో మనో వేదనకు గురై.. పైళ్లైన నెలన్నర రోజులకే తనువు చాలించింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌ లోని వనస్థలిపురంలో చోటుచేసుకుంది.

ఘటన వివరాల్లోకి వెళితే.. మలక్‌పేటకు చెందిన పల్లవి(28) ఎంబీఏ పూర్తి చేసింది. వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీకి చెందిన సంతోష్‌తో గత ఏడాది డిసెంబర్‌ 8న పల్లవికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నంగా ఒక లక్ష రూపాయలు, పెళ్లి కానుకలు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన మరుసటి రోజు నుంచే పల్లవికి వేధింపులు ప్రారంభమయ్యాయి.

గురువారం సంతోష్‌ వ్యాపారం కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం అనారోగ్యంతో ఉన్న అత్తమామలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రికి వెళ్లిన అత్తమామలు పల్లవితో మాట్లాడేందుకు పలుమార్లు ఫోన్‌ చేయగా ఆమె స్పందించలేదు. దీంతో కంగారుపడిన అత్తమామలు.. పొరుగుఇంటి వారికి ఫోన్‌ చేసి పల్లవిని పిలవాల్సిందిగా కోరారు. లోపలికి వెళ్లిన వారికి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న పల్లవి కనిపించింది.

భర్త, అత్తమామలు వేధింపులు ఎక్కువవడంతో మానసికంగా కుంగిపోయిన పల్లవి బలవన్మరణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. కుమార్తె మరణవార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కూతురు ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని ఆరోపించారు. కూతురు చావుకి అల్లుడే కారణమని పల్లవి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Newsmeter.Network

Next Story