కరోనా మహమ్మారిని జయించా.. మళ్లీ విధుల్లో చేరతా
By తోట వంశీ కుమార్
ఆ నర్సు చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఆమె అన్నట్లుగానే వారంలోనే కరోనా మహమ్మారిని జయించింది. గత నెలలో కరోనా మహమ్మారి బారిన పడిన ఆమె తాజాగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. హోం క్వారంటైన్ తర్వాత మళ్లీ విధుల్లో చేరి కరోనా బాధితులకు సేవలు చేస్తానని అంటోంది.
వివరాల్లోకి వెళితే.. కొట్టాయంకు చెందిన రేష్మ మోహన్ దాస్(32) కొట్టాయం మెడికల్ కళాశాలలో నర్సుగా పని చేస్తోంది. కాగా గత నెలలో ఇద్దరు వృద్ద దంపతులు థామస్ అబ్రహం(93), మరియమ్మ(88) కరోనా పాజిటివ్‌తో ఇక్కడి ఐసోలేషన్ కేంద్రానికి వచ్చారు. వైద్య సిబ్బంది కృషితో వారు కోలుకున్నారు. అయితే.. ఆ వృద్ధ దంపతులు ఐసీయూలో ఉండగా.. వారికి సేవలు చేసింది రేష్మనే.
ఆ సమయంలో రేష్మ కూడా వైరస్ బారీన పడింది. మార్చి 23న పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె వారంలో కరోనా నుంచి కోలుకుని బయటకు వస్తానని శపథం చేస్తూ వాట్సప్‌లో తన మిత్రులకు మెసేజ్ పెట్టింది. కాగా ఆమెతో పనిచేసిన నర్సులను ఆస్పత్రి యాజమాన్యం హోం క్వారంటైన్ పంపింది.
కరోనా బాధితులకు సేవలు అందించిన చోటే ఆమె పేషంట్ గా మారింది. కాగా.. కరోనాను ఆ వృద్ద దంపతులు జయించారు. అబ్రహం దంపతులు కరోనా నుంచి కోలుకున్న అత్యంత వృద్ధులుగా రికార్డు నెలకొల్పారు. వారు ఇంటికెళ్లిన కొద్ది గంటల్లోనే రేష్మ కూడా కోలుకోవడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం రేష్మ ను రెండు వారాల హోం క్వారంటైన్‌కు తరలించారు. పూర్తిగా కోలుకున్న తరువాత మళ్లీ విధుల్లో చేరి సేవలు అందిస్తానని రేష్మ తెలిపింది.